Apr 20,2022 06:54

ఉన్న విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు, స్థలాలు కాదు. అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధపడటం లేదు. పరీక్షలు సకాలంలో జరుపరు. ఫలితాలు వెల్లడించరు. పిహెచ్‌డి వైవా జరపరు.

    మాజంలో జరిగే లైంగిక హింస, ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ అరికట్ట లేదు కానీ జెండర్‌ సెన్సిటైజేషన్‌ కోర్సు ఉంది. పర్యావరణంపై సోయ లేదు కానీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ఉంది. మానవ విలువలు, సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి కానీ హ్యూమన్‌ వాల్యూస్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ కోర్సు ఉంది. భారతీయ సంస్కృతి వారసత్వంపై అవగాహన లేదు కానీ ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ కోర్సు ఉంది. సైన్స్‌ అండ్‌ సివిలైజేషన్‌ కోర్సు ఉంది. చాలా కాలేజీలలో నాణ్యత ఉండదు కానీ ఇంటర్నల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ సెల్‌ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. నాణ్యతను మెరుగు పరచడానికి కన్సల్టెన్సీల ద్వారా నియమితులైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఉన్నారు. ఏ రోజు కళాశాలలను చూడరు. వారు అనుబంధంగా ఉన్న కళాశాలలకు ప్రతి వారం రెండు ఈ మెయిళ్లు పోస్ట్‌ చేస్తుంటారు. వంద కళాశాలలకు ఈ మెయిళ్లు పంపితే నాలుగైదు కళాశాలలు సమాధానం చెబుతాయి. సమాధానం చెప్పని కళాశాలలపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే వీరు ఆ సీట్లో కూర్చున్నది వారి పుణ్యమే. గత రెండు సంవత్సరాలుగా డెబ్బై శాతం కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇస్తున్న కళాశాలలు పిహెచ్‌డి చేసిన వారికి రూ. అరవై వేలు, ఎంటెక్‌ చేసిన వారికి రూ. పదిహేను వేలు, ఎంఎస్సీ చేసిన వారికి రూ. పన్నెండు వేలు ఇస్తున్నారు. అటానమస్‌, న్యాక్‌, ఎన్‌బిఎ అక్రిడేషన్‌ వచ్చిన కళాశాలల్లో నాలుగు నెలలు జీతం బకాయి ఉన్నారు. చాలా ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు లేరన్న సంగతి ఉన్నత విద్యాధికారులకు తెలియదా? ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మేము మీకంటే ముందున్నామంటూ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాయి. సామజిక శాస్త్రాలు తుంగలో తొక్కారు. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను పాతరేశారు కానీ భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఎప్పుడూ చూడని వారితో చెప్పిస్తున్నారు. అడుగు భూమి లేకుండా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ కోర్సులకు అనుమతులిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్సులలో, లాడ్జీలలో, బస్టాండ్లలో అడ్మిషన్‌ సెంటర్లు పెట్టి పిహెచ్‌డి లు ప్రదానం చేస్తున్నారు. వీరి విశ్వవిద్యాలయాలలో సీట్లు ప్రభుత్వం అమ్ముతున్నది. జెఎన్‌టియూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పడి పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. 460 మంది అధ్యాపకులు ఉండవలసిన చోట కేవలం అరవై మంది అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారు. వందకు పైగా అదనపు బాధ్యతలు-రిజిస్ట్రార్‌, రెక్టార్‌, డైరెక్టర్‌ డిఎపి, అకడమిక్‌ ఆడిట్‌, స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, ఎవాల్యుయేషన్‌, కంట్రోలర్లు, ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే తనివి తీరదు. ఇంతవరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ రాక సతమతమవుతోంది. రెండు సంవత్సరాల కిందట జరిగిన నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. అందులో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారన్న అభియోగాలు వచ్చినా ... దొడ్డి దారిన వచ్చిన వారిపై చర్యలకు ఉపక్రమించింది లేదు. విశ్వవిద్యాలయానికి రీసర్చ్‌ గ్రాంట్లు లేవు. ఉన్న అరకొర నిధులు, బ్లాక్‌ గ్రాంట్లు జీతభత్యాలకు సరిపోవడం లేదు.
     కర్నూలు జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్‌ యూనివర్సిటీ శంకుస్థాపన చేశారు. పదహారు విభాగాలతో ఏర్పడ్డ రాయలసీమ విశ్వవిద్యాలయం పట్టుమని పది మంది అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలలో ముగ్గురు ఉప కులపతులు, లెక్కలేనంత మంది రిజిస్ట్రార్లు మారారు. పరిస్థితి ఏమీ మారలేదు. కొత్త వి.సి వచ్చి సగం కాలమయ్యింది. కదలాల్సిన ఫైళ్లు చెదలు పట్టి ఉన్నాయి. శాశ్వత అధ్యాపకులు లేక దశాబ్దం పైగా అవుతున్నది. దాదాపు అన్ని విభాగాలు అధ్యాపకులు లేక అకడమిక్‌ అసిస్టెంట్లతో కాలయాపన చేస్తున్నారు. మూడు సంవత్సరాల కిందట స్కాలర్లు సమర్పించిన థీసిస్‌ గ్రంథాలకు చెదలు పట్టాయి కానీ వారి వైవాకు మోక్షం లేదు. గత సంవత్సరం జరిగిన పరీక్షల ఫలితాలు ఇంతవరకు విడుదల కాలేదు. రౌతు మెత్తగుంటే గుర్రం మూడు కాళ్లతో పరుగెత్తింది అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. కొత్త కోర్సులు, కొత్త కళాశాలల అఫిలియేషన్‌కు మోక్షం లేదు. రాయలసీమ విశ్వవిద్యాలయం సమస్యలతో సతమత మవుతుండగా అక్కడి వి.సి ని కొత్తగా క్లస్టర్‌ యూనివర్సిటీకి ఉప కులపతిగా నియమించారు. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు, స్థలాలు కాదు. అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధపడటం లేదు. పరీక్షలు సకాలంలో జరుపరు. ఫలితాలు వెల్లడించరు. పిహెచ్‌డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంత్సరాలల్లో విశ్వవిద్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలులో ఉన్న సంగతి ప్రభుత్వం మరచిపోయింది. అక్కడ వి.సి, రిజిస్ట్రార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎవరూ లేరు. అందరూ తాత్కాలిక అధ్యాపకులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇక కర్నూలు-రాయలసీమ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడని ఐఐటిడియం లో రాయలసీమ ప్రాంత ప్రజలు ఒక్కరూ అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగాలలో లేరు. డైరెక్టర్‌ మొదలుకొని గేట్‌ కీపర్‌ వరకు స్థానికేతరులే. ఇలా పెరుగుతున్న విశ్వవిద్యాలయాలు తరుగుతున్న విద్యా ప్రమాణాలతో కర్నూలు జిల్లా శోభిల్లుతోంది. ఇక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైయ్యాయి. ఉన్న అరకొర అధ్యాపకులలో కొందరు సస్పెన్షన్‌, మరికొందరు లాంగ్‌ లీవ్‌ మీద వెళ్లారు. ఇక్కడ చదువుల పరిస్థితిని విద్యార్థులు గ్రహించడంతో దాదాపు మూడు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక అనుబంధ కళాశాలల సంగతి చెప్పక్కర్లేదు. గత సంవత్సరం జూన్‌ నెలలో రాసిన పి.జి పరీక్ష ఫలితాలు ప్రకటించలేదు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయం తీరు. విశ్వవిద్యాలయలలో పని చేసే వారే కరువయ్యారా అంటే సమాధానం అవుననే అనిపిస్తుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, మిషిన్‌ లెర్నింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ చెప్పేవారే లేరు. కొన్ని విశ్వవిద్యాలయాలలో విభాగ అధిపతి, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ప్రిన్సిపాల్‌గా ఒక్కరే వ్యవహరిస్తూ ఏదీ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు.
     బోధనా సామర్థ్యాలు మెరుగు పరచకుండా ఫలితాలు సాధించలేం. అధునాతన సబ్జెక్టులు, కొత్త విషయాల పట్ల మక్కువ పెంచుకొని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బోధన జరిపి విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహద పడదామన్న స్పృహ లోపించింది. విశ్వవిద్యాలయంలో తరగతులు జరగక ఎందుకొస్తున్నామా అని విద్యార్థులు వేదన అనుభవిస్తున్నారు. అనుబంధ కళాశాల విద్యార్థుల వ్యధను పట్టించుకునే నాథుడే లేడు. ఈ నేపథ్యంలో వీరికి నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందా ?!
 

- డా|| ముచ్చుకోట సురేష్‌ బాబు