కె. శేషగిరి
జాతీయ విద్యా విధానం భారత్‌ను విశ్వగురుగా నిలుపుతుందని..ప్రపంచ స్థాయి విద్యను, 21వ శతాబ్దపు నైపుణ్యాలను ఈ విధానం సాధిస్తుందని..34 ఏళ్ళ అనంతరం వచ్చిన ఈ విధానం ప్రస్తుత విద్యా రంగాన్ని అన్ని సమస్యల నుండి బయట పడేస్తుందని చాలా గంభీరమైన మాటలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఏదైనా ఒక విధానం కేవలం దాని అమలును బట్టి మాత్రమే అది మంచిదవుతుంది. 'జాతీయ విద్యా విధానం-2020' (ఎన్‌ఇపి) ప్రతిపాదించిన అనేక చర్యలు, పథకాలు మంచివైనా, చెడ్డవైనా అమలు కావాలంటే అందుకు తగిన నిధుల కేటాయింపు జరగాలి. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిడిపిలో 6 శాతం ఖర్చు చేయాలని...సాధ్యమైనంత త్వరగా ఈ లక్ష్యం పూర్తి చేయాలని ఎన్‌ఇపి చెప్పింది. అంటే 50 యేళ్ళ కిందటి కొఠారి, 34 ఏళ్ళ నాటి నూతన విద్యా విధానం చెప్పినట్టు జిడిపి లో 6 శాతం ఖర్చునే ప్రతిపాదించింది. ఈ కాలంలో విద్యా రంగం విస్తరణను పరిగణన లోకి తీసుకొని అదనంగా కేటాయింపును ప్రతిపాదించలేదు. అంటే విద్యా రంగంలో ప్రభుత్వ ఖర్చును ఏమాత్రం పెంచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని అర్థమవుతున్నది. విద్యపై మన దేశంలో ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా మన పొరుగున ఉన్న చిన్న దేశాల కన్నా తక్కువగా వుంది.
దాతృత్వ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుండి నిధులు సమకూర్చుకోవాలని చెప్పింది. విద్యా సంస్థల మౌళిక వసతులు, వనరుల మెరుగుదలకు ఒకేసారి పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలని, దీర్ఘకాలంలో పూర్వ శిశు విద్య, అభ్యసనా సామర్థ్యాలు, విద్యార్ధులకు ఉదయం అల్పాహారం, స్కూల్ కాంప్లెక్స్‌లకు, ఉపాధ్యాయ విద్యపై యూనివర్శిటీలు, కాలేజీల పునర్నిర్మాణానికి, పరిశోధనలపై టెక్నాలజీ ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడం....మొదలైన లక్ష్యాల సాధన కోసం ఖర్చు చేయాలని ఎన్‌ఇపి చెప్పింది. ఆర్థిక యాజమాన్యం, పాలన...సకాలంలో నిధులు విడుదలయ్యేటట్లు చూడాలని...నిధులు కేటాయించే సంస్థలను, నియంత్రణా వ్యవస్థను వేరు చేయాలని చెప్పింది.
ప్రస్తుతం బడ్జెట్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేస్తున్న వ్యయం 10 శాతంలో రాష్ట్రాల వాటాయే 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కేంద్రం వాటా రానురానూ తగ్గిపోతున్నది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి ద్వారా సమకూరే నిధులు కూడా విద్యపై చేసే వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఇది 2016-17 కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో 0.5 శాతం కంటే తక్కువే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే మొత్తం ఖర్చులో 0.1 శాతం కంటే కూడా తక్కువే. అంటే ఈ లెక్కలు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఖర్చుకు ఇది సబ్‌స్టిట్యూట్ కాదు.
సెస్, సర్‌ఛార్జీ ద్వారా విద్యకు సమీకరిస్తున్న నిధులలో రాష్ట్రాలకు వాటా ఉండదు. సెస్, సర్‌ఛార్జీ అనేవి ఒక ప్రత్యేకమైన కారణం కోసం విధించి వాటికే వినియోగించాలి. కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ కేటాయించే బడ్జెట్‌కు ఇది అదనంగా ఉండాలి. కాని కేంద్ర బడ్జెట్‌లో సెస్, సర్‌ఛార్జీల వాటాయే ఎక్కువగా ఉంది. ఇది ప్రజలను మోసం చేయడమే. ఉదాహరణకు భారత ప్రభుత్వం 2004లో పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కోసం 2 శాతం సెస్సును మొట్టమొదట ప్రారంభించింది. 2007-08లో 1శాతం సెస్‌ను సెకండరీ, ఉన్నత విద్య కోసం వేశారు. 2018-19లో దీనిని 4 శాతానికి పెంచి ఆరోగ్యం, విద్య సెస్ కింద మార్చారు. 2018-19లో ప్రభుత్వం కొత్తగా సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జీని దిగుమతి సుంకాల మొత్తంపై 10 శాతం వేసింది. బడ్జెట్ మద్దతులో విద్యా వ్యయం తగ్గిపోతున్నది. ముఖ్యంగా బిజెపి అధికారం లోకి వచ్చాక 2015లో విద్యా వ్యయంలో 70 శాతం సెస్ ద్వారా వచ్చినదే. అంటే సెస్ అనేది బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బును ఇచ్చే రెగ్యులర్ మార్గంగా మారింది. ఈ సంవత్సరం బడ్జెట్ పరిశీలిస్తే విద్య, ఆరోగ్య సెస్‌లో 50 శాతం, దిగుమతి సుంకాల సర్‌ఛార్జీలో 1/3వ వంతు కలిపి బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన దానిలో 64 శాతం ఉంది. వాస్తవానికి ఇవి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో భాగం కాకూడదు. ఈ లెక్కలను బట్టి ప్రజల చదువును సర్‌ఛార్జీలు, సెస్ లకు వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశాలను ఎన్‌ఇపి పరిగణ లోకి తీసుకోకుండా చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా?
దాతృత్వ సంస్థలు, వ్యక్తుల ద్వారా నిధులు సమీకరించాలనేది ఎన్‌ఇపి మరో ప్రతిపాదన. చాలా దేశాల్లో అనుభవాలు, చారిత్రికంగా చూస్తే దాతృత్వ సంస్థలు ఆయా దేశాల్లో విద్య పునాదిని విస్తరింప చేశాయి తప్ప విద్యలో పెట్టుబడికి అవి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాలేదు. ముఖ్యంగా మత సంస్థలు విద్యపై పెట్టే పెట్టుబడి కరిక్యులమ్ ను, సబ్జెక్టును, బోధనను ప్రభావితం చేస్తాయి. వీటి అంతిమ చేరిక లౌకక వాదాన్ని బలహీనపర్చడమే. ఎన్‌ఇపి ఉత్సాహం చూస్తే పెట్టుబడుల కన్నా ప్రస్తుతం విద్యా వ్యవస్థలో మత ప్రాబల్యాన్ని పెంచడమే లక్ష్యంగా కనిపిస్తుంది. దాతృత్వ వ్యక్తులు వారసత్వంగా వచ్చే ఆస్తిపై పన్ను మినహాయింపు కోసం ఇచ్చే విరాళాలు చాలా పరిమితమైనవి. ప్రస్తుతం ఇది మన దేశంలో రద్దు చేయబడింది. సమాజసేవ చేసే స్థానికుల నుంచి విరాళాలు సేకరించాలని ఎన్‌ఇపి చెప్పింది. అయితే కులం, మతం, లింగం, ప్రాంతాలవారీగా వివక్షకు గురవుతున్న సమాజంలో ఇటువంటి చొరవలు ఈ అసమానతలను మరింత స్థిరీకరిస్తాయి. ఇంకా పెంచుతాయి.
మోడీ ప్రభుత్వం 2014 నుండి విద్యా బడ్జెట్ తగ్గిస్తూ వస్తున్నది. 2014-15లో 4.14 శాతం నుండి ప్రస్తుతం 2019-20లో 3.4 శాతానికి తగ్గించింది. జిడిపి లో 2014-15లో 0.53 శాతం కాగా 2019-20 0.45 శాతానికి తగ్గింది. కేంద్రం ప్రైవేట్ విద్యా సంస్థలకు రుణాలిచ్చి వారి ప్రైవేట్ ఆస్తులను కూడా విద్యపై జిడిపి లో చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. కేంద్ర బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం అయితే వాటా తగ్గడమే కాదు నిజ కేటాయింపు కూడా తగ్గింది. పాఠశాల విద్యకు 2014-15లో రూ.38,600 కోట్లు కేటాయిస్తే 2018-19కు రూ.37,100 కోట్లుకు తగ్గింది.
ఎన్‌ఇపి రాష్ట్రాలకు, ఉన్నత విద్యా సంస్థలకు నిధులను సకాలంలో పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా ఇవ్వాలని చెప్పింది. అయితే గత ఐదేళ్ల నుండే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. అది రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటాను సకాలంలో ఇవ్వడం లేదు. వినియోగంపై ఆంక్షలు పెడుతున్నది.
1976లో విద్యను ఉమ్మడి జాబితాలో పెట్టినపుడు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి రాష్ట్రాలకు సహాయ పడేందుకే అన్నారు. ఆనాటికి విద్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే వ్యయంలో కేంద్ర వాటా 8.9 శాతం ఉంటే నేటికి అది పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర యూనివర్సిటీలను కూడా కేంద్రం తన పెత్తనం లోకి తీసుకున్నది. ఇది ఆర్టికల్ 246 కు విరుద్ధం. ఎన్‌ఇపి యూనివర్సిటీలన్నింటినీ స్వయం పోషకం కమ్మంటున్నది. అంటే విద్యా వ్యయం భారాలు రాష్ట్రాలవి. పెత్తనం కేంద్రానిది.
బిజెపి ప్రభుత్వం విద్యకు నిధుల విషయంలో ఎంత మోసకారిగా వ్యవహరిస్తోందో ఆర్‌టిఇ చట్టం విషయంలో అర్థం చేసుకోవచ్చు. తొలుత ఎన్‌ఇపి ముసాయిదాలో చాలా అట్టహాసంగా విద్యా హక్కు చట్టాన్ని 3 నుండి 18 ఏళ్లకు విస్తరిస్తూ ప్రతిపాదించింది. ఎప్పటి నుండో చేస్తున్న డిమాండ్ కాబట్టి అందరూ స్వాగతించారు. అయితే దాని అమలుకు నిధులు కేంటాయింపుపై ఎన్‌ఇపి ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. దాంతో ఎక్కువ రాష్ట్రాల విద్యా మంత్రులు నిధుల విషయంలో ప్రశ్నించడంతో తుది నివేదికలో దాన్ని తీసివేసింది. విద్యపై ప్రభుత్వ ఖర్చును పెంచే ప్రతిపాదన ఎన్‌ఇపి చేయకపోవడానికి కారణం పెద్దఎత్తున ప్రైవేట్ రంగాన్ని కార్పొరేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికే. విద్యను కొనుగోలు చేయలేని 65 శాతం మంది ప్రజల భవిష్యత్తు అంధకారమే. అందుకే విద్యకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త ప్రజాతంత్ర ఉద్యమం నడవాలి.
(వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి)










