Jun 17,2023 21:55

స్కీమ్‌ వర్కర్ల పట్ల ప్రభుత్వం వివక్ష
పిఎఫ్‌, పెన్షన్‌, పిఆర్‌సి వర్తింపు వంటివేమీ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటన
రెండు జిల్లాల్లో ఏడు వేల మందికిపైగా అంగన్వాడీలు విలవిల
రూ.పది వేలు వేతనం తీసుకుంటున్న ఆశాలకూ పథకాల్లో కోత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం. చిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకంగా మారిపోయాయి. ముఖ్యంగా అంగన్వాడీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలీచాలని జీతాలు ఇస్తూ.. ప్రభుత్వ పథకాలు అందించకుండా నిలిపివేయడంతో జిల్లాలో ఏడు వేల మందికిపైగా అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారింది. రూ.పది వేలు జీతం అందుకుంటున్న ఆశా వర్కర్లలోనూ చాలామందికి ప్రభుత్వ పథకాలు అందని దుస్థితి నెలకొంది.
అంగన్వాడీ ఉద్యోగులకు రూ.11 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఇదే ఇబ్బందిగా మారే పరిస్థితి కన్పిస్తోంది. రెండు జిల్లాల్లో 7,372 మంది వరకూ అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు రూ.11 వేలు, ఆయాలకు రూ.ఏడు వేల చొప్పున ప్రతినెలా జీతం ఇస్తోంది. వీరంతా స్కీమ్‌ వర్కర్లు. ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేసింది. అంగన్వాడీ కుటుంబాల్లో వృద్ధులకు పెన్షన్‌గాని, కొత్త రేషన్‌కార్డులుగాని, అమ్మఒడి, ఇంటి స్థలాలు, చేయూత, పిల్లలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వంటి ఏఒక్క ప్రభుత్వ పథకం అమలు కావడం లేదు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా తిరస్కరిస్తున్న పరిస్థితి ఉంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చే జీతం రూ.11 వేలు నెలలో సగం రోజులకు కూడా సరిపోని పరిస్థితి. మిగిలిన కుటుంబ సభ్యులు పనికెళ్తేనే కుటుంబం ముందుకు సాగే పరిస్థితి. అలాంటి చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా తయారైంది. అంగన్వాడీలకు పిఎఫ్‌గాని, పెన్షన్‌, పిఆర్‌సి వర్తింపు వంటి ఏఒక్క సౌకర్యమూ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగులని చెప్పడం విస్మయపరుస్తోంది. రూ.50 వేలకుపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగుల తరహాలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ సైతం నిలిపివేయడంతో అంగన్వాడీ ఉద్యోగులు తమ పిల్లలను చదివించుకోలేని దుస్థితి నెలకొంది. ఉద్యోగ విరమణ పొందినా జాబితా నుంచి పేరు తొలగించకపోవడంతో వృద్దాప్య పెన్షన్‌ సైతం అందుకోలేని దుస్థితిని ప్రభుత్వం సృష్టించింది. అంగన్వాడీలకు కనీస వేతన చట్టం సైతం వర్తింపజేయని ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఏవిధంగా చెబుతుందో ఏఒక్కరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను తగ్గించుకోవడం కోసం ఈ విధంగా చిరుద్యోగులైన అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు చర్చ సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.పది వేలు ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం కలిగిన వారికి పథకాలు వర్తించవని ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీలకు రూ.11 వేలు జీతమే అందుకుంటున్నా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
ఆశా వర్కర్లకూ ప్రభుత్వ పథకాల కోత
రెండు జిల్లాల్లో మూడు వేల మంది వరకూ ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం రూ.3,760, రాష్ట్రప్రభుత్వం 7,200 మొత్తం రూ.పది వేల వరకూ వేతనంగా వస్తోంది. పది వేలు జీతం తీసుకుంటున్నారనే కారణంతో ఆశా వర్కర్లకు సైతం ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో పథకాలు అందుకుంటున్న వర్కర్లకు మాత్రమే కొనసాగుతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఆశా వర్కర్లలో సగం మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలుస్తోంది. అంగన్వాడీ, ఆశాలు వంటి చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇదే వైసిపికి పెద్ద ఎదురుదెబ్బ కానుందనే చర్చ రాజకీయంగా నడుస్తోంది.