- సమస్యలు చర్చించకుండానే అర్ధంతరంగా ముగింపు
- పలువురు డుమ్మా
- ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వని అధికారులు
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం తీరు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాలులో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలపై మాత్రమే చర్చకు అవకాశం దక్కింది. మొత్తం వివిధ శాఖలకు సంబంధించి 31 అంశాలను పొందు పర్చగా వ్యవసాయం, ఇరిగేషన్, పౌర సరఫరాలు, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన చర్చ కేవలం రెండున్నర గంటలు మాత్రమే జరిగింది. మూడు జిల్లాల్లో అనేక సమస్యలు వేధిస్తుండగా సమావేశాన్ని అర్ధంతరంగా ముగించడంపై అనేకమంది ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అజెండాలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సమావేశం నిర్వహించే తీరు ఇదేనా.. ఇకనుంచి నన్ను పిలవకండి అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జెడ్పి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్య సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి సమగ్ర చర్యలు తీసుకోవడానికి వేదికగా ఉండాల్సిన జడ్‌పి సమావేశాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదంటూ పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. తమ సమస్యలను చెప్పుకోవడాని అవకాశం లేదంటూ పలువురు జడ్‌పిటిసిలు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేకపోవడంతో దుమారం
వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్షలో భాగంగా పలువురు ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోళ్లపై అధికారుల అస్పష్టత సమాధానాలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. జడ్‌పి వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, ఎంఎల్‌సిలు తోట త్రిమూర్తులు, చిక్కాల రామ చంద్రర్రావు, ఐ.వెంకటేశ్వరరావు, ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలా వరకు కోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో బొండాలు రకం కొనుగోలుపై అధికారులు నేటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు. అన్ని రకాల ధాన్యాన్ని ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు బయట మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్నారు. రబీలో ధాన్యం దిగుబడి ఎక్కువగా వస్తుందని, అయితే ఎకరాకు కేవలం 34 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు విధించడం సరికాదన్నారు. కొనుగోలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదు. ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో తెలియజేయాలని అధికారులను కోరారు. ఉమ్మడి జిల్లాలో 8లక్షలకు క్వింటాళ్లు పైగానే బొండాలు రకం ఉత్పత్తి అవ్వగా టార్గెట్ తక్కువ తీసుకోవడం సరికాదన్నారు. దీనిపై కాకినాడ జిల్లా సివిల్ సప్లై డిఎం పుష్పామణి మాట్లాడుతూ బొండాలు రకం ధాన్యాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుందని వివరించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జెసి ధ్యానచంద్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో 2.8లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఎకరాకు 33 క్వింటాళ్ల దాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గ నిర్దేశకాలు జారీ చేసిందన్నారు. కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జెడి విజరు కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లోనూ 50 శాతం మేర బొండాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు పలువురు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,స్థానిక ఆర్‌బికెల వద్దే అమ్ముకునేలా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అధికారులను ప్రశ్నించారు. అలాగే ఆర్‌బికెల్ల్లో ఒకలా, రైస్ మిల్లుల్లో మరోలా తూకాల్లో తేడాలు చూపించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై జెసి ధ్యానచంద్ మాట్లాడుతూ ఈ సమస్యలు ఈ ఏడాది ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ టానే లంక, పశువులంక, గేదెల లంక తదితర గ్రామాల్లో ఒఎన్‌జిసి డ్రెడ్జింగ్ పనుల వలన పలువురు రైతులు తమ పంటలను పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని, రైతులకు పరిహారం ఇవ్వడంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కోరగా సమస్య ఇంకా తమ దృష్టికి రాలేదని ఆ జిల్లా జెసి తెలిపారు.
సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం ఏదీ.?
ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాగు, సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. జూన్ 1న సాగునీరు విడుదల చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా కాలువల మరమ్మతుల కారణంగా సాగునీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నార్లు వేసుకునేలా అను కూలంగా లేదన్నారు. ఈ ఏడాదైనా కాలువల మరమ్మతుల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ధవలేశ్వరం, విజ్వేశ్వరం పరిధిలో వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీటిని అందించే ప్రాజెక్టు పనులు అటకెక్కా యన్నారు. కోనసీమ జిల్లాలో 32 మండలాలకు, కాకినాడ జిల్లాలో కేవలం నాలుగు మండలాల కేంద్రాల్లో మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికి త్రాగునీటిని అందించార న్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎప్పటికీ అందజేస్తారని సంబంధిత శాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు.
సమావేశంలో పాల్గొన్న ఎంఎల్‌సి అనంతబాబు
దళిత యువకుడిని హత్య చేసి నేరుగా డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి బెయిల్‌పై వచ్చిన ఎంఎల్‌సి అనంత ఉదయభాస్కర్ సుదీర్ఘకాలం తర్వాత బుధవారం జరిగిన జడ్‌పి సమావేశానికి హాజరయ్యారు. దీంతో పలువురు ప్రజా ప్రతినిధులు హత్య కేసుపై మరోసారి చర్చించు కున్నారు.
ఆలస్యంగా సమావేశం, పలువురు డుమ్మా
సమావేశం గంటపాటు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. నలుగురు ఎంఎల్‌ఎలు తప్ప మిగిలిన నియోజవర్గాల ఎంఎల్‌ఎలు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఎంపిలు వంగా గీత, అనురాధ, మార్గాని భరత్ హాజరు కాలేదు. తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు రాలేదు. మంత్రి దాడిశెట్టి రాజా కొంతసేపు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.
జడ్‌పి సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు










