రాయచోటి : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై సానుకూలంగా స్పందిస్తూ నిర్ధేశిత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ గిరీష పిఎస్ విజ్ఞప్తులు స్వీకరించారు. స్పందన కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖా స్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక స్పష్టంగా పంపాలన్నారు. ప్రతి అధికారి స్పందన ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి రోజుకు అరగంట పాటు ప్రత్యేక దష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోని దరఖాస్తులన్నింటినీ వేగంగా గడువులోగా పరిష్కరించాలని ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అర్జీలన్ని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










