రాయచోటి : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై సానుకూలంగా స్పందిస్తూ నిర్ధేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్‌తో పాటు, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, డిఆర్‌ఒ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఎడి జయరాజ్, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా కషి చేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో ప్రయాసలకు కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రధాన కేంద్రాలకు వస్తుంటారని అధికారులు ప్రజల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్క రించాలన్నారు. ప్రతి అధికారి స్పందన ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోని దరఖాస్తులన్నింటినీ వేగంగా గడువులోగా పరిష్కరించి ఏ ఒక్క దరఖాస్తు కూడా బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జెసి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి శివయ్య, ఐసిడిఎస్ పీడీ ధనలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.