Oct 16,2023 20:48

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ చూపరాదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో జెసి, డిఆర్‌ఒ సత్యనారాయణలు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ పరిధిలోకి వెళ్లకుండా ప్రజలు అందజేసిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోపు నాణ్యతగా పరిష్కరించాలి. అర్జీలపై క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలి. పెండింగ్‌ దరఖాస్తులు, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్‌ లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. మదనపల్లి మండలం పొన్నేటి పాలెం గ్రామీణ ప్రాంతానికి చెందిన జె.చిన్నప్ప తన కాలుకు ఇన్‌స్పెక్షన్‌ సోకడంతో మోకాలి పైభాగం వరకు తొలగించారని, మూడు చక్రాల స్కూటర్‌, పింఛను మంజూరు చేయాలని కోరారు. రాజంపేట మండలంలోని ఇసుకపల్లె దళితవాడకు చెందిన ఎస్‌.శంకరయ్య తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రామసముద్రం మండలంలోని ఉళ్లపాడుకు చెందిన బి.ఝాన్సీ లక్ష్మి ఎపి రెసిడెన్షియల్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఈ ఏడాది జూన్‌ నుంచి పనిచేస్తున్నానని జీతం రాలేదని కోరారు. మంజూరుకు చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.