Sep 23,2023 09:18

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

           కొత్తచెరువు : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే అని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సూచించారు. కొత్తచెరువు డీఆర్డీఏ వెలుగు భవనంలో జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ పి.కొండయ్య పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డీఆర్డీఏ పీడీ నరసయ్యతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించాలన్నారు. అర్జీ ఏదశలోనూ పరిష్కారానికి నోచుకోని పక్షంలో ఆ విషయాన్ని అర్జీదారునికి తెలపాలని సూచించారు. అర్జీల పరిష్కార ప్రక్రియలో ఆయా శాఖల అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. మండల స్థాయి అధికారులు అర్జీలను పెండింగ్‌ లేకుండా సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో నియోజకవర్గస్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించామని, ప్రస్తుతం మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు అందరూ బాధ్యతగా వ్యవహరించి స్పందన అర్జీలకు పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బారాన్‌ సాహెబ్‌, తహశీల్దార్‌ రామాంజనేయ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పశువులకు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించండి.
           పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ పి. అరుణ్‌ బాబు సూచించారు. కొత్తచెరువు టిటిడి కళ్యాణమండపం సమీపంలోని ఏరియా పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న వివిధ సేవలు గురించి కలెక్టర్‌ సంబంధిత శాఖ అధికారులు, వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌ స్టాక్‌, కేసుల నమోదు రిజిస్టర్‌, ల్యాబ్‌ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు లాభదాయకమైన పశుపోషణ పద్ధతులపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రకతి వైపరీత్యాల సమయంలో పశువుల మరణ శాతాన్ని తగ్గిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారి డా||ఎన్‌.శుభదాస్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా||మల్లేష్‌ గౌడ్‌, డా||కష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.