ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జగన్ననకు చెబుదాం కార్యక్రమాన్ని జెసి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొండమోడు - పేరేచర్ల రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు త్వరగా పరిహారం చెల్లించాలని సత్తెనపల్లికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీల్లో ఇల్లు బేస్‌మెంట్ లెవెల్‌కు వచ్చినా ఇంతవరకు బిల్లు రాలేదని సత్తెనపల్లి పట్టణానికి చెందిన పోట్లూరి శ్రవంతి ఫిర్యాదు చేశారు. రెంటపాళ్ల జెడ్‌పి పాఠశాల సమీపంలో సత్తెనపల్లి - క్రోసూరు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు కోసం ఆకుల గోపి కోరగా అధికారులకు జెసి ఆదేశాలు జారీ చేశారు. రేషన్ సరుకులు సరిగా ఇవ్వటం లేదని సత్తెనపల్లి నాగార్జున నగర్‌కు చెందిన శిఖా కొండలు ఫిర్యాదు చేశారు. నందిగామలో వాగు ముంపు సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు ప్రొక్లైన్‌తో పూడిక తీయించాలని ఎంపిడిఒను జెసి ఆదేశించారు. భూములు రీసర్వే నేపథ్యంలో సాగునీటి కాల్వలు అన్యాక్రాంతం కాకుండా ఎన్‌ఎస్పీ అధికారులకు రీసర్వేలో పాల్గొనాలని ఇఇ మురళీధర్‌కు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బిఎల్‌ఎన్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళీ, తహసిల్దార్ సురేష్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రైతుల సమక్షంలోనే రీసర్వే : జెసి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భూములు రీ సర్వే పనులపై రైతులతో చర్చించి, వారి సమక్షంలోనే చేయాలని అధికారులకు జెసి స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అసైన్డ్ భూములు, ఇనాం భూములు, మ్యుటేషన్ కన్వర్షన్, సబ్ డివిజన్స్, ఎఫ్- లైన్ పిటిషన్లు వ్యవసాయ భూములు మార్పులు వంటి విషయాలపై చర్చించి పలు సూచనలు చేశారు.










