Jul 17,2023 22:44

ప్రజాశక్తి-విజయవాడ
స్పందనలో నమోదయ్యే ఆర్జీలు పునరావృతం కాకుండా ప్రాధమిక దశలోనే పరిష్కారం చూపాలని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశంలో సోమవారం కలెక్టర్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ అర్జీదారుల నుండి 162 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్‌ పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆర్జీదారుల వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆర్జీలకు పరిష్కారం ఉండాలన్నారు. జిల్లాలో లివ్‌-ఇన్‌, డేటింగ్‌ యాప్‌ల సంస్కృతి వ్యాపిస్తుందనే పలు ఫిర్యాధులు అందుతున్నాయని దీనిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొండపల్లి బొమ్మలకు ఓటింగ్‌ వేద్దాం
కొండపల్లి బొమ్మలకు జాతీయ అవార్డు సాధించడం ద్వారా జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే వన్‌ డిస్టిక్ట్‌ - వన్‌ ప్రొడక్ట్‌ 2023 అవార్డుకు జిల్లా నుండి నామినేట్‌ అయిన కొండపల్లి బొమ్మలకు ఇ-ఓటింగ్‌ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సోమవారం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ అధికారి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ఈ కళారూపాలు భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి, ఎ కొండూరు, జి కొండూరు అటవీ ప్రాంతాల్లో తెల్ల పొణికి కలప మొక్కల విస్తీర్ణాన్ని పెంచే విధంగా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇ-ఓటింగ్‌లో ప్రతిఒక్కరూ కొండపల్లి బొమ్మలకు ఓటు వేయాలన్నారు.
గిరిజనునలకు చెక్కుల పంపిణీ
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జక్కంపూడి వైయస్‌ఆర్‌ కాలనీలో నివసిస్తున్న 32 చెంచు గిరిజన కుటుంబాలకు చెందిన గృహాల్లో విద్యుద్దీకరణకు రూ.6.99 లక్షల చెక్కును కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ లబ్దిదారులకు అందజేశారు. గతంలో కృష్ణలంక ప్రాంతంలో నివసిస్తూ ఉండే చెంచు గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు జక్కంపూడి వైయస్‌ఆర్‌ కాలనీలలో ప్రత్యేకంగా గృహాలను కేటాయించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే జి.కొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన ఏడు యానాది గిరిజన కుటుంబాలకు చెందిన లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.63 వేలు చొప్పున అందజేశారు.