Sep 25,2023 21:30

ప్రజలనుండి వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌

అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    జగనన్నకు చెబుదాం-స్పందన విజ్ఞప్తులపై వెంటనే స్పందించి అర్జీదారులు సంతృప్తి చెందేస్థాయిలో గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ సర్వేకి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌లలో వయసుతో నిమిత్తం లేకుండా కేవలం వంద రూపాయలు రిజిస్ట్రేషన్‌ ఫీజుతో అడ్మిషన్‌ అయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు గుర్తించిన వారిని చేర్పించాలన్నారు. ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన 573 మంది విద్యార్థులకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని డివిఈఓను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన పనులకు బిల్లులను వెంటనే అప్లోడ్‌ చేస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. జగనన్నకు చెబుదాం 24 గంటల్లో పరిష్కరించాల్సిన ఆరు సమస్యలు ఉన్నాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా పారిశుధ్యం స్పష్టంగా కనిపిస్తోందని, సంబంధిత ఈఓఆర్డీలు, క్లాప్‌ మిత్ర, పారిశుధ్య సిబ్బంది తగు చర్యలు తీసుకునేలా చూడాలని డిపిఒ, మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఆరోగ్య సురక్ష సర్వేపై కలెక్టర్‌ ఆరా తీస్తూ వాలంటీర్‌, ఏఎన్‌ఎం సర్వే విడివిడిగా చేపట్టి తీసుకోవాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలను పరిగణలోకి తీసుకొని ఈనెల 30న హెల్త్‌ క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు..
కోవెలకుంట్ల మండలం సౌదరిదిన్నె గ్రామ వాసి మర్రిబోయిన గంగరాజు తనకు 90 శాతం వికలాంగుల సర్టిఫికెట్‌ వుందని, ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. నంద్యాల పట్టణ ఫ్యాఫ్టో నాయకులు జిపిఎస్‌ విధానాన్ని మంత్రిమండలిలో ఏకపక్షంగా ఆమోదించారని, దాన్ని రద్దు చేసి జిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు కలిగే నష్టాలను నివారించాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. అంతకుముందు ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ట్రావెల్‌ ఫర్‌ లైఫ్‌ ప్రతిజ్ఞ జిల్లా అధికారులతో చేయించారు. అనంతరం ఈ నెల 30వ తేదీ బనగానపల్లెలో నిర్వహించే స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ జాబ్‌ మేళా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, అన్ని శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు.