ప్రజాశక్తి-విజయవాడ: స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను స్పందన దృష్టికి తీసుకువస్తే పరిష్కారమవుతాయనే దృక్పదంతో స్పందన ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్‌లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. స్పందనలో 94 వినతులు అందాయి. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఎస్‌వో పి.కోమలిపద్మ, ఐసిడిఎస్ పీడి జి.ఉమాదేవి, డియంహెచ్‌వో డాక్టర్ యం.సుహాసిని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










