మదనపల్లె అర్బన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిసాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజలలో సంతృప్తికర స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని ఎపి డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సభాభవనంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వివిధ శాఖలలో వచ్చిన అర్జీలపై కలెక్టర్ గిరీషతో కలిసి ఆయన అన్ని శాఖల హెచ్‌ఒడిలతో సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోగా క్లియర్ చేయాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. కలెక్టర్ గిరీష మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం అర్జీలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, మదనపల్లె, రాయచోటి, ఆర్‌డిఒలు మురళి, రంగస్వామి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి సి.గురుప్రకాష్ రావు, డిపిఒ ధనలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, ల్యాండ్ అండ్ సర్వే ఎడి జయరాజ్, హౌసింగ్ పీడీ శివయ్య, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనీమియా నివారణపై ప్రత్యేక చర్యలు
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని అహ్మద్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ఎస్‌బిఐ కాలనీ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ గిరీషతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం రామారావు కాలనీ అంగన్వాడీ సెంటర్‌ను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు గర్భిణులకు సీమంతం నిర్వహించారు.










