ప్రజాశక్తి-విజయవాడ: ప్రజల సమస్యలను పరిష్కరించాలనే దృక్పదం కలిగినప్పుడే పరిష్కార మార్గాలు దొరుకుతాయని అటువంటి ఆలోచన దోరణి అధికారులలో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలనే దృక్పదం కలిగిన్నపుడు సమస్య పరిష్కారానికి మార్గాలు లభిస్తాయని అటువంటి ఆలోచనా దోరణి అధికారులలో కలగాలన్నారు. అర్జీదారుడు తన సమస్యను స్పందన ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారన్నారు. ప్రజలకు స్పందనపై ఉన్న నమ్మకాన్ని పెంచాలంటే అర్జీలకు సరైన శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. అర్జీదారుని నుండి అర్జీని స్వీకరించినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను అర్థం చేసుకుని ఏ విధంగానైనా పరిష్కరించి అర్జీదారుని సంతృప్తి పరచాలనే దృక్పదంతో అధికారులు ఆలోచించినప్పుడే సంబంధిత సమస్యకు ఎదో ఒక చోట పరిష్కారం లభించక తప్పదన్నారు. స్పందనలో 90 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 35, పోలీస్ 10, యంఎయుడి 07, ఏపిఎస్‌పిడిసిఎల్ 2, దేవదాయశాఖ 1, పంచాయతీరాజ్ 07, పశుసంవర్థక శాఖ 2, సర్వే అండ్ సెటిలిమెంట్ 3, విద్యా శాఖ 1, మత్స్య శాఖ 4, వైద్య ఆరోగ్య శాఖ 4, పౌర సరఫరాల శాఖ 07, గనులు అండ్ భూగర్భ శాఖ 1, ఉపాధి కల్పన 1, ఖజాన 2, ఏపిఎస్‌అర్‌టిసి 1, విభిన్న ప్రతిభావంతుల శాఖ 2, శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. స్పందన కార్యక్రమంలో డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, డిసివో సిహెచ్ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, హౌసింగ్ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం. విజయభారతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










