రాయచోటి : జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా అర్జీదారులకు మెరుగైన సేవలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, రీసర్వే, పంచాయతీ రాజ్, వ్యవసాయం తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగనన్న సురక్షకు సంబంధించి వచ్చిన అర్జీలకు టోకెన్స్ రైజ్ చేసి వాటికి సర్వీసు రిక్వెస్ట్ రూపంలో నమోదు చేసి అర్జీదారులకు మెరుగైన సేవలు అందజేయాలన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 15 లక్షల టోకెన్స్ రైజ్ కాగా 13 లక్షల సర్వీసు రిక్వెస్ట్ నమోదు చేసి 11 లక్షల దరఖాస్తులను అప్రూవ్ చేశారన్నారు. జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించినప్పుడు సదరు క్యాంపుల ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలన్నారు. జగనన్నకు చెబుదాంకు సంబంధించి ఎక్కువ శాతం రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్ (ఎనర్జీ), మున్సిపాలిటీ, హోమ్‌శాఖలకు నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని వాటిని బియాండ్ ఎస్‌ఎల్‌ఎకు వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల వారీగా సమీక్షలు నిర్వహించుకొని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రీసర్వే ఫేజ్-2 గ్రామాలకు సంబంధించి నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి పిఎం కిసాన్ ఈ-కెవైసి అథెంటికేషన్ జూలై 31వ తేది నాటికి పూర్తి చేయాలని అందుకు గాను వ్యవసాయ కార్యదర్శి, వాలంటీర్, విలేజ్ సెక్రటరీలు పిఎం కిసాన్ ఈ-కెవైసి అథెంటికేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి జగనన్న చేయూత, జగనన్న ఆసరా పథకాల ద్వారా రైతులకు మంజూరు చేసిన పశువుల నుంచి సేకరించిన పాలను పలు జిల్లాలో ఏర్పాటు చేసిన అమూల్ కేంద్రాలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టరు వైఎస్‌ఆర్ పశు సంచార వాహనాల ద్వారా గ్రామాలలోని పశువులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామాలలోని నిరుపేద ఎస్‌సి, ఎస్‌టి వారికి ఉపాధి కల్పించేలా చూడడంతో పాటు శిబిన్న ప్రతిభావంతులకు కూడా ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలన్నారు.










