Sep 21,2023 00:46

గోపాలపట్నం మండలం జగనన్నకు చెబుదాంలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి -గోపాలపట్నం : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. గోపాలపట్నం మండలం, శాంతినగర్‌ సచివాలయం కమ్యూనిటీ హాల్‌లో మండల స్థాయి 'జగనన్నకు చెబుదాం' (స్పందన) కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గోపాలపట్నం మండల పరిధిలో ఉన్న గ్రామ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో మండల స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి అక్టోబర్‌ 13వ తేదీ వరకు బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాలలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. అధికారులందరూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై పూర్తి శ్రద్ధతో పరిశీలించి సరైన సమాధానం నిర్దేశించిన సమయంలోగా ఇవ్వాలని ఆదేశించారు. గోపాలపట్నంలో వచ్చిన అర్జీలలో ప్రధానంగా రెవెన్యూ, జివిఎంసి, హౌసింగ్‌, ఇతర శాఖలకు సంబంధించి 33 విజ్ఞప్తులు అందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌ విశ్వనాథన్‌, ఎపిఎంఎస్‌ఎంఇడిసి చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌, జివిఎంసి డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, కో ఆప్షన్‌ సభ్యులు బెహరా భాస్కరరావు, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, పోలీస్‌ అధికారులు, వివిధ శాఖల జిల్లా , డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.