Jul 10,2023 21:23

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - బెలగాం : సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ఆర్జీదారుల్లో ఆవేదనను చూసి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై జిల్లా, మండల అధికారులకు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీదారులు అనేక కష్టనష్టాలకు ఓర్చి జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారని చెప్పారు. సచియాలయం, మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు మాత్రమేనని ఆయన అన్నారు. కావున సచియాలయం, మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయం స్థాయిలో ఆర్జీదారులతో మర్యాద పూర్వకంగా సమాచారం అందించడంలో లోపం ఉన్నట్లు భావిస్తున్నామని, దీన్ని తక్షణం సరిదిద్దుకోవాలని అన్నారు. ఆర్జీదారులతో ప్రేమ పూర్వకంగా ఉండాలని, వారి సమస్యను అర్థం చేసుకోవాలని సూచించారు. సచివాలయం పరిధిలో పరిష్కారం కానివి మండల స్థాయిలో పరిష్కారం విధిగా ఉండాలని స్పష్టం చేశారు. వందకు పైగా అర్జీలు జిల్లా కేంద్రం వరకు రావడం, వాటిని సచివాలయం, మండల స్థాయిలో పరిష్కారం కొరకు పంపించడం అక్కడే పరిష్కారం కావడం జరుగుతుందని ఆయన వివరించారు. ఆర్జీదారుల ముఖాల్లో మన కుటుంబీకులను చూడాలని హితవు పలికారు. ''మనం అందరం చిన్న స్థాయి కుటుంబాల నుండి వచ్చాం ... ఆర్జీదారుల సమస్యలు అర్థం చేసుకోగలం'' అని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ఆర్జీదారుల కష్టాలు తీర్చండి... వారి మోములో ఆనందం చూడండి... మీలో కలిగే సంతప్తి అనుభవించండి... అన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్‌ ప్రకారం 'జగనన్న సురక్ష' నిర్వహించాలి
పార్వతీపురంరూరల్‌ : జగనన్న సురక్ష పథకం షెడ్యూల్‌ ప్రకారం ఆయా సచివాలయాల పరిధిలో కచ్చితంగా నిర్వహించి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు అందించాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావుతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించే గ్రామాల్లో అందజేయాల్సిన ధ్రువపత్రాలను ముందురోజే సిద్ధం చేసుకోవాలన్నారు. ముందుగా ఇచ్చిన షెడ్యూలు ప్రకారం జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేయాలని, షెడ్యూలులో ఎటువంటి మార్పులు చేయకూడదని తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు కార్యక్రమం నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల సామాజిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కోరుతూ 97దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.