Jan 22,2023 00:00

ఇపిడిసిఎల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం, రైతు నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
కశింకోట గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఇసిఎస్‌)ను సహకార రంగంలో కొనసాగించాలని సిపిఎం, రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ట్రూ ఆఫ్‌ ఛార్జీలు, టారిఫ్‌ రేట్లుపై మూడు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో శనివారం సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యాన స్థానిక ఏపీఈపీడిసిఎల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం అప్పలరాజు, సిఐటియు జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, వ్యకాస నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, కె.రాము మాట్లాడుతూ ట్రూ ఆఫ్‌ ఛార్జీలు, టారిఫ్‌ రేట్లు మార్పుతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం ద్వారా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత దిగజారుతుందని తెలిపారు. అనంతరం డిఈఈ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బ్రహ్మాజీ, దాకారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.