ఓటర్ల జాబితా సవరణ రాష్ట్ర పరిశీలకులు ఎంవి.శేషగిరిబాబు
ప్రజాశక్తి - ఏలూరు
వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక అధికారులు, అఖిలపక్ష నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా శేషగిరిబాబు మాట్లాడుతూ పోలింగ్ బూత్‌స్థాయి అధికారులకు ఎఇఆర్‌ఒల ద్వారా ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై ఎటువంటి విచారణ చేయాలి, ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ అందించాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యంతరాల సమయంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కార విధానాన్ని ఒక ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటనను ఈ నెల 9వ తేదీన విడుదల చేశామన్నారు. డిసెంబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి 26వ తేదీలోగా అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే జనవరి 5వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణపై ప్రతి గ్రామంలోనూ టాంటాం, మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. బిజెపి ప్రతినిధి నెరుసు నెలరాజు, టిడిపి ప్రతినిధి పాలి ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సమయంలో ఒక వార్డులోని ప్రజల ఓట్లు పక్కవార్డులోని జాబితాలో నమోదయ్యాయని, వాటిని సరిదిద్దాలని కోరారు. వైసిపి ప్రతినిధి కలవకొల్లు సాంబ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ బదిలీ ఐన, చనిపోయిన, వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని కోరారు. సిపిఎం ప్రతినిధి బి.సోమయ్య మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఓటర్ల నమోదు, సవరణలపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద విభిన్న ప్రతిభావంతులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎవి.సత్యనారాయణమూర్తి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్ర, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఎన్.బాలాజీ, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, ఆర్‌డిఒలు కె.పెంచల్‌కిశోర్, ఝాన్సీరాణి, బిఎస్‌పి ప్రతినిధి సిర్ర భరత్ పాల్గొన్నారు.
పోలింగ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన శేషగిరిబాబు
పెదపాడు: మండలంలోని వట్లూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్.136ను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు మిరియాల వెంకట శేషగిరిబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అందిన ఫారం-6, ఫారం-7 దరఖాస్తులను పరిశీలించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి రిజిస్టర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచల్‌కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు, తహశీల్దార్ విజరుకుమార్, డిప్యూటీ తహశీల్దార్ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.










