ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
మండలంలోని పోలేపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా బుధవారం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తేగాడ సన్నమ్మ అనే వృద్ధురాలు తనకు పెన్షన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి మొరపెట్టుకోగా రేషన్ కార్డు నుంచి పేరు వేరు చేయించి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత కొలమానంగా కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండా రాంబాబు, వైసిపి మండల అధ్యక్షుడు అచ్చం నాయుడు, దాక వరపు నాగేశ్వరరావు, స్థానిక సర్పంచ్ సీతా పైడినాయుడు, ఎంపీటీసీ సీతావరలక్ష్మి సన్యాసినాయుడు, ఎంపీడీవో సువర్ణ రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గొలుగొండ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఈ మూడున్నరేళ్ల పాలనలో అమలు చేశామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ అన్నారు. గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామంలో రెండో రోజు బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల ముందు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు పథకాలు అందిస్తామని చెప్పి, మూడున్నర సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న కనకదుర్గ ఆలయంలో వేదపండితులు ఎమ్మెల్యే గణేష్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ, విద్యుత్ తీగలు ఇళ్లపై వేలాడుతున్నాయని ప్రజలు వివరించారు. వీటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, వైసిపి మండల అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, యువజన పార్టీ అధ్యక్షుల రామకృష్ణనాయుడు, మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, స్థానిక సర్పంచ్ కాపారపు చిన్నబ్బాయి, ఎంపిటిసి లెక్కల అప్పలనాయుడు, చీడిగుమ్మల సహకార బ్యాంక్ చైర్మన్ రామకృష్ణ, మాజీ చైర్మన్ కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
13, 14 తేదీల్లో కొత్తపల్లిలో..
దేవరాపల్లి : మండలంలోని ఏ.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఈనెల 13, 14తేదీల్లో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసిపి మండల అధ్యక్షుడు బూరె బాబురావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.










