ప్రజాశక్తి- దేవరాపల్లి
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని వాకపల్లి సచివాలయం పరిధి వెంకటరాజపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా ఆధునికీకరణ చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాడు-నేడు పథకం కింద రూ.16 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి ఇప్పటికే అనేక అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.73 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు మరో రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు, దేవరాపల్లి జెడ్‌పిటిసిలు ఈర్లె అనురాధ, కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, వైస్ ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి వెంకట రమణ, వెంకటరాజపురం గ్రామ సర్పంచ్ దాసరి సంతోష్ కుమార్ వైసిపి నాయకులు పాల్గొన్నారు.










