Aug 24,2023 21:41

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌: 
అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. జిల్లాలో అర్హత కలిగి పలు కారణాలతో సంక్షేమ పథకాలు అందుకోలేని 6,995 మంది లబ్ధిదారులకు రూ.7.09 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసిందని తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సాంకేతిక, ఇతర కారణాల వల్ల అందుకోలేకపోయిన వారిని గుర్తించి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. సోషల్‌ అడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించి, పారదర్శకతతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొందర, కూరాకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రాజాపు హైమావతి, డిఆర్‌డిఎ పీడీ డి.వి విద్యాసాగర్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇ.అనురాధ, బిసి కార్పొరేషన్‌ ఇడి ఆర్‌.గడ్డెమ్మ, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.