అధికారులకు రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్ ఆదేశం
ప్రజాశక్తి - ఏలూరు
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపుహాలులో గురువారం నూజివీడు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జెడ్‌పి చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జెసి బి.లావణ్య వేణి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా అధికారులు, నూజివీడు నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు నవరత్నాల కార్యక్రమం ద్వారా విన్నూత్న రీతిలో అనేక సంక్షేమ పధకాలను సిఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. వాటిని అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలన్నారు. నూజివీడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో నివాసానికి యోగ్యం కానీ ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు అందించారని, ఆ భూముల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు విముఖత చూపిస్తున్నారని మంత్రి దృష్టికి ఎంఎల్‌ఎ తీసుకురాగా, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జల జీవన్ మిషన్ మొదటి విడత పనులు నూరుశాతం పూర్తయ్యాయని, రెండో విడతలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. నూజివీడు నియోజకవర్గంలో మంజూరైన 76 గ్రామ సచివాలయ భవనాలు, 77 రైతు భరోసా కేంద్రాలు, 66 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 84 పాఠశాలలకు సంబంధించి మంజూరైన 99 పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం విజ్ఞపుల్లో 136 పనులను రూ.6.23 కోట్లతో చేపట్టేందుకు మంజూరు చేశారన్నారు. వీటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. జలకళ ద్వారా గతంలో 633 బోర్లు వేశారని, వాటికి విద్యుత్ సౌకర్యం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. సాగుకు ఉచిత విద్యుత్‌కు నూజివీడు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ట్రాన్స్‌కో అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డ్వామా పీడీ రాము, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై.రామకృష్ణ, ఎపి కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










