Oct 19,2023 21:38

గుడిసెలు వేసుకున్న స్థలంలో పేదలతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్లపట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం అర్హులుగా గుర్తించి పట్టాలు మంజూరు చేయల్సిన వారి సంఖ్య చిలమత్తూరు లో 179 మంది, కోడూరు లో 100 మంది ఉన్నారని అన్నారు. వీరు కాక 90 రోజుల కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 400 మంది దాకా ఉన్నారని అన్నారు. వీరందరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లోని అనువైన ప్రదేశాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పట్టాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అందరికి పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేవలం ఒక చోట స్థలాన్ని చూసి ఇస్తామని చెప్పి మభ్య పెట్టడంతో ఒరిగేది ఏమి లేదని అన్నారు. చిత్త శుద్దితో పేదలకు లబ్దిచేకూర్చేలా, మేలు చేకూర్చేలా మంచి ప్రదేశంలో స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు సర్వే నెంబర్‌ 805 లో గుడిసెలు వేసుకొని ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మినారాయణ, రామచంద్ర, సదాశివరెడ్డి, చందు, శివ, చరణ్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.