Sep 17,2023 23:02

ప్రజాశక్తి-రామచంద్రపురం
అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కొత్తగా మంజూరైన437 వైఎస్‌ఆర్‌ పింఛన్లను ఆయన అందజేశారు. మండల పరిషత్కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పింఛన్‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సిఎం జగన్‌ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి గడప..గడపకూ సంక్షేమ పథకాలు అందే విధంగా కషి చేస్తున్నారని మంత్రి అన్నారు ముఖ్యంగా కె.గంగవరం మండలంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ, అభయ హస్తం, ఫిషర్‌ మాన్‌, డప్పు కళాకారులకు, అర్హులైన వారికి కొత్తగా 437 వైఎస్‌ఆర్‌ పింఛన్లను మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు కె.గంగవరం మండలంలో కొత్త పెన్షన్లతో కలుపుకుని 10283 మందికి వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక అందిస్తున్నామని, రూ.2,75,14,500 లబ్ధిదారులకి ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలను రూపొందించిందని అర్హత ప్రమాణికంగా ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు పంపన నాగమణి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండుల గోవిందరాజు, గ్రామ సర్పంచులు, జెడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, తహశీల్దార్‌, ఎంపిడిఒ, వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.