ప్రజాశక్తి - ఏలూరు టౌన్
అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేసి వారి జీవితాల్లో ఆనందాన్ని చూడడమే సిఎం జగన్ లక్ష్యమని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. స్థానిక 50వ డివిజన్‌లో పింఛన్లు మంజూరైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గురువారం ఎస్‌ఎంఆర్ నగర్‌లో మేయర్ నూర్జహాన్ పెదబాబు చేతులమీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ సిఎం జగన్ అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లను మంజూరు చేసి ఎందరో జీవితాల్లో సంతోషాన్ని నింపారన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, ఏలూరు నియోజకవర్గ 50 డివిజన్ల పరిధిలో ఎంఎల్‌ఎ ఆళ్ల నాని చొరవతో ఈ నెలలో రెండు విడతలుగా మొత్తంగా 1658 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతినెలా 29,500 మందికి సుమారు రూ.8 కోట్లు పింఛన్ల రూపంలో అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గవరపేట నాయుడు, మానుకొండ శ్రీను, మణిపూరి కుమారి, పిల్లా శివ, నక్క కృష్ణ, రామకృష్ణ, శ్రీను, మల్లేశ్వరరావు, సచివాలయ అడ్మిన్ ప్రదీప్ పాల్గొన్నారు.
టి.నరసాపురం :మండలంలోని కేతవరం పంచాయతీలో కొత్తగా మంజూరైన వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్లన్లు 18 మందికి వైసిపి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి మధుతో కలిసి కేతవరం సర్పంచి తడికలపూడి శివమాధవి కిషోర్ గురువారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నా రన్నారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూ రు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు బొడ్డపాటి రాంబాబు, వైసిపి నాయకులు వంటిపల్లి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, ఆచంట కుటుంబరావు, కిషోర్, బాలిన రాజేశ్వరరావు పాల్గొన్నారు.
పోలవరం : మండలంలోని గూటాల పంచాయతీలో నూతనంగా పెన్షన్ వచ్చిన లబ్ధిదారులకు జిల్లా ఎంపిపి సంఘం అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి చేతుల మీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీ వారితో వారికి నచ్చిన వారికే పెన్షన్ కేటాయించేవారని, వైసిపి హయాంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ పెన్షన్ వస్తుందని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు హరిరామకృష్ణ, సర్పంచి సిరిపూరపు ప్రసాద్, గూటాల సొసైటీ ప్రెసిడెంట్ సుంకర అంజిబాబు, వైసిపి నాయకులు శ్రీరామకృష్ణ, డాక్టర్ శ్రీను, మహంతి అబ్బులు, కరిబండి రాంబాబు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి :మండలంలోని కామయ్యపాలెం పంచాయతీలో నూతనంగా మంజూరైన పెన్షన్లను గురువారం పంపిణీ చేసినట్లు వైస్ ఎంపిపి-2 ఉప్పల లలితకుమారి తెలిపారు. మండలవ్యాప్తంగా 335 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. వాటిలో కామయ్యపాలెం పంచాయతీలో 20 పెన్షన్లు మంజూరవ్వగా లబ్ధిదారులకు అందించినట్లు ఆమె తెలిపారు. పార్టీలకతీతంగ అర్హులైన వారందరికీ పెన్షన్ మంజూరు చేసిన ఘనత వైసిపికే చెందు తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బొడిక భోగేశ్వ రావు, సీనియర్ నాయకులు ప్రసాద్, ఉప్పల రాంపండు, దొడ్డకుల సత్యనారయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : పట్టణంలో 226 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేయడం హర్షణీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. పట్టణంలో నూతనంగా మంజూరైన పింఛన్లను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నాగలక్ష్మి చేతులమీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ సిఎం జగన్ ఆరు నెలలకోసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ ఎంతోమందికి సాయపడుతున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులందరికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.భవానీప్రసాద్, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










