Oct 10,2022 23:45

జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న సుభద్ర


ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో అర్హత కలిగిన వారికి వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లు అందటం లేదని, అనర్హులకు అందుతున్నాయని, వాటిని సరిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కోరారు. జిల్లా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆమె మాట్లాడుతూ, వయస్సు తక్కువ ఉన్న వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందుతున్నాయన్నారు. 60 ఏళ్లు పైబడి అర్హులైన వృద్ధులకు సాంకేతిక కారణాలు పేరుతో అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఫీల్డ్‌ సిబ్బందితో పరిశీలన జరిపి, క్షుణ్ణంగా విచారణ చేసి అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు ఎటువంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పాలని డ్వామా అధికారులను కోరారు. జగనన్న కాలనీలలో ఇదివరకే డబ్బు చెల్లించిన వారికి రియంబర్స్‌మెంట్‌ ప్రాసెస్‌ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. డెంగీ నివారణకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.