ప్రజాశక్తి-సీతమ్మధార, కంచరపాలెం : అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మాధవధారలోని మాధవస్వామి కల్యాణ మండపంలో ఉత్తర నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిపై జివిఎంసి కమిషనర్ రాజాబాబు, నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు, డిప్యూటీ మేయర్ కె.సతీష్, అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చాలా పనులు దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 27 సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ ఇళ్ల పథకంలో అర్హత ఉండి ఇల్లు మంజూరు కానట్లయితే దరఖాస్తు చేసిన 90 రోజులలో తప్పక మంజూరు చేస్తామని చెప్పారు. స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న వాలంటీర్లను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే కాలనీ ఇళ్లకు మరమ్మత్తులు చేపడతామన్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారికే అర్హత మేరకు టిడ్కో ఇళ్లు మంజూరు అవుతాయన్నారు.
నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు మాట్లాడుతూ, ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని కోరారు. వార్డుల్లో పలు చోట్ల వీధి దీపాలు వెలగటం లేదని తెలిపారు. పలు వార్డులలో రోడ్లు, కాలువలు, రోడ్ల వెడల్పు, రైతు బజార్లు ఏర్పాటు, జూనియర్ కాలేజీ మంజూరు, సచివాలయ సమస్యలను వివరించారు.
జివిఎంసి కమిషనర్ రాజాబాబు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి అధికారులందరూ కృషి చేయాలన్నారు. వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతులను జిల్లా కలెక్టరుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒలు హుస్సేన్ సాహెబ్, భాస్కర్‌రెడ్డి, జివిఎంసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ బాణాల శ్రీను, కార్పొరేటర్ ఆర్.వెంకటరమణ, రెవెన్యూ, హౌసింగ్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య, దేవాదాయ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.










