Jun 17,2023 00:03
అక్రిడిటేషన్‌ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అర్హులైన మీడియా ప్రతినిధులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టరు పి రంజిత్‌ బాషా తెలిపారు. అక్రిడిటేషన్‌ జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అక్రెడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని కలెక్టరు చెప్పారు. నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నుంచి 264 దరఖాస్తులు వచ్చాయన్నారు. ధవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి అర్హులను గుర్తించామన్నారు. జిఓ నెం. 38ని అనుసరించి జిల్లా కమిటీ పలు నిర్ణయాలు తీసుకుందని కలెక్టరు వివరించారు. తొలి విడతలో ప్రింట్‌ మీడియా నుంచి 125 మందికి, ఎలక్ట్రానిక్‌ మీడియా నుంచి 82 మంది ప్రతినిధులకు అక్రెడిటేషన్లు జారీ చేస్తున్నట్లు కలెక్టరు ప్రకటించారు. అక్రెడిటేషన్లు పొందిన మీడియా వారికి బస్‌పాసులు అందజేస్తామని అన్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలోని మీడియా ప్రతినిధులకు ఉమ్మడి జిల్లాలో ప్రయాణించేందుకు బస్‌ పాస్‌ పరిమితులు ఉంటాయని తెలిపారు. అలాగే నిబంధనలు అనుసరించి చిన్న, మధ్యతరహా పత్రికలకు త్వరలో అక్రెడిటేషన్లు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. గతంలో మాదిరిగా రైల్వే పాసులు మంజూరు చేయించాలని కమిటీలోని మీడియా ప్రతినిధులు కలెక్టరు దృష్టికి తెచ్చారు. పూర్వం మాదిరిగానే మీడియా ప్రతినిధులకు రైల్వే పాసులు ఇవ్వాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానిస్తూ రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టరు తెలిపారు. సమావేశంలో సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె సుభాషిణి, కమిటీ సభ్యులైన వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఎస్‌ విజయమ్మ, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రసాద్‌, రైల్వేశాఖ బాపట్ల స్టేషన్‌ మేనేజర్‌ కె మీనా, చీఫ్‌ బుకింగ్‌ సూపర్‌వైజర్‌ ఏడుకొండలరావు, ఆర్‌టిసి డిఎమ్‌ టి శ్రీనివాసరావు, కార్మిక శాఖ అధికారి రామకృష్ణ, డివిజనల్‌ పౌర సంబంధాల అధికారి టి మోహన్‌ రాజు, పౌర సంబంధాల అధికారి కె కిరణ్‌ కుమార్‌, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.