ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎపిడబ్ల్యుజెఎఫ్ తాలూకా అధ్యక్షులు ఎస్‌కె.షబ్బీర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా తహశీల్దార్ జయన్నకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల పేరుతో జర్నలిస్టులకు ఇచ్చే గుర్తింపు కార్డులను కుదించడం అన్యాయమన్నారు. ఎలాంటి నిబంధనలూ లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పని చేసే జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని కోరారు. గౌరవాధ్యక్షులు యు.చంద్ర శేఖర్, కార్యదర్శి దేవిశంకర్, ట్రెజరర్ ఎంఎస్.బేగ్, లీగల్ అడ్వయిజర్ బి.శ్రీనివాసులు, ఇలియాస్, సురేంద్ర, ఇబ్రహీం, మురళీ, ఉస్మాన్ పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టు నాయకులు










