ప్రజాశక్తి-అనకాపల్లి
కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని, అర్హులై ఉండి ఎరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలంలోని అక్కిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కాళ్లు చచ్చుబడిన కొండ లక్ష్మి అనే వికలాంగురాలు తనకు సొంత ఇల్లు మంజూరు చేయాలని మంత్రిని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన అధికారులను పిలిచి ఇంటి స్థలం మంజూరుతో పాటు ఇంటి నిర్మాణం చేయాలని ఆదేశించారు. పోలియోతో బాధపడుతున్న పిల్లల వెంకట అప్పారావు తనకు ఇచ్చే వికలాంగుల పింఛన్ సరిపోలేదని, అదనపు ఆర్థిక సహాయం అందించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, సర్పంచులు శలపురెడ్డి నరసింహారావు, సాలాపు కనక సన్యాసిరావు, ఈగల రామునాయుడు, కలగా గున్నయ్య నాయుడు, సేనాపతి శ్రీను, జోగ నాగేశ్వరరావు, గ్రామ సచివాలయ కన్వీనర్ నారపిన్ని ప్రసాద్, మామిడి ధనలక్ష్మి, సీరంశెట్టి అప్పలరాజు, మాజీ సర్పంచ్ రఘు పాల్గొన్నారు.
రూ.2.50 కోట్లతో మినీ స్టేడియం
చోడవరం : చోడవరం ఎడ్ల వీధిలో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మించనున్నామని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. బుధవారం చోడవరం సచివాలయం-3 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల వీధిలో ఉన్న ఎర్ర చెరువును ఇరిగేషన్ అధికారుల అనుమతులతో పూడ్చివేసి ఆ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. చెరువుగట్టుపై పాకలు వేసుకుని ఉన్నవారందరికీ పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడవక సత్యారావు, స్థానిక సర్పంచ్ బండి నూకాలమ్మ శ్రీను, ఎంపీపీ గాడి కాసు, వైసిపి నాయకులు ఓరుగంటి నెహ్రూ, దేవరపల్లి సత్య, పొట్లూరి అరుణ, బైన ఈశ్వరరావు, సూర్యనారాయణ, పి అప్పారావు యాదవ్, వేచలపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.










