Jul 11,2023 22:18

ఫొటో : లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం
- 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను, అవసరమైన ధృవీకరణ పత్రాలను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని అరుంధతీయవాడ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పత్రాలను అందజేశారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఈ సచివాలయం పరిధిలో సుమారు 1200 గృహాల్లో వలంటీర్లు, గృహసారథులు, అధికారులు ప్రతీఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారని, అందులో భాగంగా 868 ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి రోజుల వ్యవధిలోనే అందజేసినట్లు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ధృవీకరణ పత్రాలు పొంది వాటితో సంక్షేమ పథకాలకు అర్హత సాధించవచ్చని పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటన సందర్భంగా ప్రజలు తెలిపిన ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆయన ఎంతో ముందుచూపుతో ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందజేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.2.50 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందచేశారని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందజేసేందుకు సచివాలయం, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారన్నారు. తద్వారా ఎటువంటి అవినీతికి తావులేకుండా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, జెసిఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి శ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్దార్‌ కౌన్సిలర్లు షేక్‌ మహబూబ్‌ బాషా, తోకల తిరుపతమ్మ, పుచ్చలపల్లి రాధిక, ఐవి రమణారెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ బి.నాగేశ్వరరావు, మున్సిపల్‌ ఆర్‌ఐ ఖాసీం, తదితరులున్నారు.