Aug 18,2023 22:48

అర్హులకే అసైన్‌ భూములపై హక్కు కల్పించాలి

ప్రజాశక్తి - మైలవరం : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములపై హక్కులను అర్హులైన వారందరికీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కార్యదర్శులు కోట కళ్యాణ్‌, కె.శ్రీదేవి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములపై అర్హులకు హక్కులు కల్పించాలని కోరుతూ శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలవరం మండలంలో చండ్రగూడెం, పొందుగల, వివిధ గ్రామాల్లో గతంలో ఫీల్డ్‌ లేబర్‌ కోపరేటివ్‌ సొసైటీగా ఏర్పడి భూములు సాగు చేస్తున్న వారికి శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రాల పోరాట నగర్‌, కొత్తగూడెం గ్రామాలతో పాటు రెడ్డిగూడెం, విజయవాడ రూరల్‌, జి.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసుకుంటున్న పేదలందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రావూరి రమేష్‌ బాబు, సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌.సుధాకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి పి.నాగేశ్వరరావు, సందిపాము ఇసాక్‌, లంక వెంకటేశ్వరరావు, మైలవరం భూ పోరాట కమిటీ సభ్యులు కోట సురేష్‌, పౌలు, అబ్రహం, తోమండ్రు యేసు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న
ప్రజా సంఘాల నాయకులు