ప్రజాశక్తి-ఆదోనిరూరల్
అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందించడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బుధవారం మండలంలోని మండిగిరి పంచాయతీ పరిధిలో శాంతి ఎస్టేట్‌లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ప్రతి గడపకూ తిరిగి పథకాలను వివరించారు. ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. ఆయా కుటుంబాల్లో ఏయే సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని, వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. మండిగిరి మాజీ సర్పంచి శేషిరెడ్డి, శ్రీవిద్యా స్కూల్ వినోద్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వైసిపి నాయకులు సాదాపురం మురళీ, కళ్లుపోతుల సురేష్, శ్రీకృష్ణదేవరాయలు, హుస్సేనప్ప పాల్గొన్నారు. కోసిగిలోని 5వ సచివాలయంలో రెండో రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మండల జెసిఎస్ ఇన్‌ఛార్జీ పి.మురళీమోహన్ రెడ్డి కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం బీరప్ప దేవాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, భీమలింగమ్మ, దేవి, శైలజ, లత గర్భిణులకు ఏర్పాటు చేసిన సీమంతంలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కాలనీవాసుల కోరిక మేరకు బీరప్ప గుడి నుంచి రైల్వే ట్రాక్ వరకు సిసి రోడ్డు మంజూరు చేయడంతో పాటు డ్రెయినేజీ కాలువకు అడ్డంగా కల్వర్టు నిర్మాణానికి హామీ ఇచ్చారు.