Aug 04,2023 22:33

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

- కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డులు జారీ
- ఫారం 6, 7, 8కు డాక్యుమెంట్స్‌ తప్పనిసరి
- కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదులో ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని, అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ హెచ్చరించారు. ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదులో అర్హులైన ప్రతిఒక్కరి పేరు నమోదు కావాలన్నారు. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న సమయంలో వాలంటీర్లను ఉపయోగించుకున్నా, వెంట తీసుకెళ్లినా చర్యలు తప్పవన్నారు. 18 ఏళ్లు నిండిన ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులు చేసుకున్న ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎపిక్‌ కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8ను పూరించే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్తగా నమోదైన ఓటర్లతో పాటు సవరణ జరిగిన, తొలగించిన ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసి, సంతకాలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో సమస్యలు తలెత్తితే ఇఆర్‌ఒ, జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించాలన్నారు. ఓటర్ల ఫారం-6, 7, 8తో పాటు సంబంధిత ఆధారాలను ఫారం 13, 14 నోటీసులను ఇఆర్‌ఒ కార్యాలయంలో భద్రపరచాలని సూచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న 17 నుంచి 20 మధ్య గల వయస్కుల వారిని నమోదు చేయాలన్నారు. తీసుకున్న దరఖాస్తులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. ఎపిక్‌ కార్డులను ఎప్పటికప్పుడు ప్రింట్‌ చేసి ఓటర్లకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బిఎల్‌ఒ ఇంటింటి సర్వేను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని తద్వారా ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు వినియోగించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జి.జయదేవి, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ తదితరులు పాల్గొన్నారు.