అర్హుల ఓట్లు తొలగిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : గోనుగుంట్ల
ధర్మవరం టౌన్ : రాజకీయ స్వలాభం కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను తొలగించే కుట్రలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహారం ఉందని, ఆ కోణంలోనే బోగస్ ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం పట్టనంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తే ఆర్డీవో, తహశీల్దార్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోతులనాగేపల్లి వద్ద అనర్హులకు పట్టాలిస్తే ఆర్డీవో, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ధర్మవరం నియోజకవర్గం లో చాలా తప్పిదాలు జరిగాయని, ఇప్పటికే 4 ఎపిసోడ్లు పెట్టానని, త్వరలో 5వ ఎపిసోడ్ కూడా వదులుతానని అన్నారు. వీటిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకులా చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుదర్శన్‌రెడ్డి, డిష్ రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, దుస్సా క్రిష్ణ, బోడగల గిరిధర్, రాప్తాటి రాము, తుంపర్తి పరమేశ్, దేవేంద్రరెడ్డి, నబి రసూల్, అశ్వర్థనాయుడు, చిలకం సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.










