పార్వతీపురంటౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం అభివద్ధి పథంలోకి దూసుకు వెళ్తుందని సి.రాఘవచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. సిఆర్ ఎపి మీడియా అకాడమీ, ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ - పాలన సంస్కరణలు - మెరుగైన పౌర సేవలపై సదస్సు గురువారం స్థానిక లయన్స్ క్లబ్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్యఅతిధిగా పాల్గొనగా, ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని, ప్రతి 50 గృహాలకు వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందన్నారు. అర్హతే ప్రామాణికంగా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించి విమర్శలకు తావులేకుండా సుపరిపాలన అందిస్తున్న సంగతిని వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో 10 మంది వైద్యులు, 105 రకాల మందులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. విశాఖలో రూ.15వేల కోట్లతో ఇన్ఫోసిస్, ఫార్మా కంపెనీలు ఏర్పాటు, రామాయపట్నం వద్ద రూ.45వేల కోట్లతో సోలార్ ప్రాజెక్ట్ వంటివి రాబోతున్నాయని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనుందని అన్నారు. ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ పేద, బడుగు, అట్టడుగు, బలహీన వర్గాలతో పాటు అందరికీ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదని చెప్పారు. ఆర్టికల్ 13,17లను నిజం చేసి నెహ్రూ ఆలోచనలు, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించి దాదాపు కోటి రూపాయల సంపదను ఇచ్చి ప్రజల అవసరాలను తీరుస్తున్నారని చెప్పారు. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఆంగ్ల భాషలో విద్య, నాడు-నేడు పేరుతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు, వచ్చే జనవరి నుంచి రూ.3వేల పింఛను వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం చుక్కవానివలస, నిమ్మవలస, పొట్టిగడపవలస గిరిజన యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందిస్తున్న జి.గోపాలరావు, గణేష్, ఉమాలకు దుస్సాలువతో సత్కరించారు. తొలుత జిల్లాకు విచ్చేసిన చైర్మన్‌కు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్ ఘన స్వాగతం పలికారు. ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ పి.కె.ప్రకాష్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో జిల్లా ఉద్యానవన అధికారి గిరిజ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముఖరాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ గున్నేష్, ఎంపిపి శోభారాణి, ఎంఇఒ ఎస్.సింహాచలం, ఉపాధ్యాయులు తిరుపతిరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










