ప్రజాశక్తి - పంగులూరు
అర్హతే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వైసిపి ఇన్చార్జి, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం జరిగిన రెండవ విడత పింఛన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. పింఛన్లతోపాటు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా అర్హులైన ప్రజలకు అందరికీ అందిస్తుందని అన్నారు. ఎవరికైనా సాంకేతిక కారణాలవల్ల ఆగిపోయి ఉండవచ్చని, అలాంటి వారిని కూడా పరిగణలోకి తీసుకొని సంక్షేమ పథకాలు వర్తించే విధంగా సిఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారని అన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పదకాల వల్ల రాష్ట్రం దివాలాతీస్తుందని నిన్నటి వరకు ప్రచారం చేసిన చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడే సరికి జగన్‌కన్నా ఎక్కువ అమలు చేస్తానని బూటకపు హామీలు ఇస్తున్నాడని అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దని కృష్ణ చైతన్య అన్నారు. మరోసారి జగన్ అధికారానికి వస్తే మరెన్నో పదకాలు తీసుకొస్తారని అన్నారు. చంద్రబాబు అక్రమాలు ప్రజలు గుర్తించాలని అన్నారు. గత 40ఏళ్లుగా తప్పించుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడు సమయం వచ్చి దొరికాడని అన్నారు. చంద్రబాబుకు కష్టం వస్తే కొడుకు, కోడలు, భార్యకు లేని బాధ దత్తపుత్రుడికి వస్తుందని అన్నారు. లోకేష్ పప్పు అని, అతని వల్ల ఏమీ కాదని అన్నారు. అనంతరం మండలంలో రెండో విడత మంజూరైన 136 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. సభకు ఎంపీడీవో రామాంజనేయులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పంగులూరు సర్పంచి గుడిపూడి నాగేంద్రమ్మ, ఎంపీపీ తేళ్ల నాగమ్మ, మండల ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి, మరో ఉపాధ్యక్షురాలు పొన్నూరు రామాంజమ్మ, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకటసుబ్బారావు, కొండమూరు సర్పంచి బండి శివకుమారి పాల్గొన్నారు.










