Aug 23,2023 22:54

కాలువిరగిన మున్సిపల్‌ కార్మికుడు వెంకటేష్‌తో పాటు, మరికొందరని ముందస్తు అరెస్టు చేసి పుట్టపర్తి స్టేషన్‌లో ఉంచిన పోలీసులు

        పుట్టపర్తి అర్బన్‌ : సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చలో విజయవాడకు వెళ్తున్న మున్సిపల్‌ కార్మికులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటినుంచి కదిలేందుకు వీల్లేదంటూ కార్మికులు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులను మంగళవారం రాత్రి నుంచి నిర్బంధించారు. గృహ నిర్బాంధాలు, ముందస్తు అరెస్టులతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారు. తాము న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తున్నామని కార్మికులు చెప్పినా పోలీసులు వినలేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి, కార్మికులను అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై జిల్లా వ్యాప్తంగా కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వివిధ మున్సిపాల్టీల్లో పని చేసే కార్మికులు చలో విజయవాడకు బయళ్దేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తితో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ పోలీసులు కార్మికులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. నిర్బంధంలోకి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. గురువారం నాడు విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పుట్టపర్తిలో మున్సిపల్‌ కార్మికులు పెద్దన్న, రామయ్య, గోవిందు, నర్సింహులు నాగార్జున, వెంకటేశు, రామదాసు పి.వెంకటేశు, రమణ తదితరులను అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. అమడగూరులో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణను అరెస్టు చేసి నల్లమాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాలువిరిగినా కనికరం చూపలేదు..
పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన మున్సిపల్‌ కార్మికుడు వెంకటేశుకు ఇటీవల ఓ ప్రమాదంలో కాలు విరిగింది. మరో వ్యక్తి సహాయం లేనిదే ఆయన నడవలేని పరిస్థితి. కాలు విరగిన నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈయన్ను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తాను కాలినొప్పితో బాధపడుతున్నానని, విజయవాడ వెళ్లడం లేదని కార్మికుడు వెంకటేశుపోలీసులను బ్రతిమలాడినా వారు కనికరం చూపలేదు. ఉదయం ఇంటి నుంచి తీసుకెళ్లి సాయంత్రం వరకు పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. కాలినొప్పితో ఆయన బాధపడుతున్నా పోలీసులు స్పందించకుండా మిన్నకుండిపోయారు.
అరెస్టులు దారుణం
ఇఎస్‌.వెంకటేష్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి

శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలిపేందుకు వెళ్తున్న మున్సిపల్‌ కార్మికులు, యూనియన్‌ నాయకులను పోలీసులు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌ తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఇది మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.