May 08,2022 07:04

ఉద్యోగుల పిఆర్‌సి పోరాటం, సిపిఎస్‌ రద్దు, అంగన్వాడీలు, ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, విశాఖ ఉక్కును కేంద్రం, విద్యుత్‌ కేంద్రాలు, రేవులను రాష్ట్రం ప్రైవేటీకరణ చేయడం, ఉభయులూ కూడబలుక్కుని విద్యుత్‌ మీటర్లు, మునిసిపల్‌ పన్నులు వంటివన్నీ పెంచడం, మండిపోతున్న ధరలు, ఇద్దరి మధ్య నలిగిపోతున్న పోలవరం నిర్మాణం, నిర్వాసితుల ఘోష, వెనకబడిన ప్రాంతాల నిధులకు ఎగనామం, భారీ లోటు భర్తీకి నిరాకరణ, అపారంగా పెరిగిపోతున్న అప్పుల భారంపై రకరకాల కథనాలు. చెప్పాలంటే ఇవన్నీ విధానపరమైన అంశాలు. కేంద్ర రాష్ట్రాల విధానాలు మారకుండా పరిష్కారం కావు.

    ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలను, పరిపాలనా వ్యవహారాలను పరిశీలించే వారెవరికైనా కనిపించే కొన్ని ప్రధానాంశాలు ఇవే. ఆర్థిక భారాలు, హామీల ఉల్లంఘనలపై ఉద్యమిస్తున్న ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం. రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వృత్తిదారులు, మహిళలు, ఏ తరగతికి చెందిన వారైనా ఏ సమస్య ముందుకు తెచ్చినా రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం. పొంగిపొరలే అసహనం, అసభ్యత. ప్రతి ప్రజా సమస్యనూ వైసిపి, టిడిపి రాజకీయ రగడలో భాగంగా మార్చడం. ఆఖరుకు మహిళలపై అత్యాచార ఘటనలు కూడా ఎదురుదాడికి దారితీయడం మొదటిసారి చూస్తున్నాం. దుర్మార్గమైన అత్యాచారాలను పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడం పాలకుల కనీస బాధ్యత. కాని ఈ వారంలో జరిగిన అనేక దారుణాల సందర్భంలో రాజకీయ ఎదురుదాడి సాక్షాత్తూ సంబంధిత మంత్రుల స్థాయిలోనే జరగడం గతంలో ఎరుగనిది. పరామర్శించడానికి వెళ్లిన మహిళా నాయకులను అరెస్టు చేయడం, అత్యాచారం అనుకోకుండా జరిగిందని హోం మంత్రి తానేటి వనిత వంటి వారు చెప్పడం ఎప్పుడైనా చూశామా? రేపల్లె రైల్వేస్టేషన్‌ ఘటనలో మద్యం మత్తులో వున్న నిందితులు డబ్బు లాక్కోవడానికే వెళ్లారట. అడ్డుపడిన భార్యను తోసేసే సందర్భంలో ఇది జరిగిందట. ఇలాంటివి జరుగుతుంటాయట. ఈ మాటలు ఒక మహిళా హోం మంత్రి నుంచి ఆశించేవేనా? సహించాల్సినవేనా? తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళపై హడావుడిగా పోలీసులు ఆరోపణలు చేయడం ఇంకా ఘోరం. ముఖ్యమంత్రి జగన్‌ లేదా మరొకరు ఇది సరికాదని చక్కదిద్దే ప్రయత్నం చేశారా? ఆ పని చేయకపోగా ఈ ఘటనలలో అరెస్టయినవారు, పాల్పడిన వారు టిడిపి వారని జగన్‌, మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి చెప్పడం చూశాం. అధికారంలో వుంది మీరే గనక అదే నిజమైనా పట్టుకోవలసిన, వాస్తవాలు పూర్తిగా వెల్లడించాల్సిన బాధ్యత మీదే. ఎవరు ఏ పార్టీ వారు ఏ పదవిలో వున్నారనేదాన్ని బట్టి అత్యాచారాల చర్చ చేయడం కన్నా విపరీతం మరొకటి వుండదు. వారంలో ఇన్ని దారుణాలు ఎందుకు జరిగాయనేది దాటేయడం కోసం మాటిమాటికీ గతంలో జరిగిన వాటిని ఏకరువు పెట్టడం వల్ల కూడా ప్రయోజనం వుండదు. ప్రజలలో విశ్వాసం కలగదు. ముఖ్యంగా కుటుంబాలలో మహిళలలో భయం తొలగదు. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా ఇదే కుట్ర సిద్ధాంతం విన్నాం. అప్పుడైనా ఇప్పుడైనా అరికట్టాల్సింది పసిగట్టాల్సింది పోలీసులు, ప్రభుత్వమే కదా? పరిస్థితి తీవ్రత చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాల్సింది సర్కారే కదా? దాని బదులు రాజకీయ ప్రత్యారోపణలు ఎవరికోసం? కొన్ని దశాబ్దాలుగా బాధిత మహిళల కోసం పోరాడుతున్న, అండగా నిలుస్తున్న ఐద్వా నేతలను కూడా అనుమతించకుండా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో పెట్టడం ఏం నీతి? గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సందర్భాలలో వైసిపి నాయకులు వెళ్లేవారు కాదా? విజయవాడ ఆస్పత్రిలో ఘటన, తుమ్మపూడిలో హత్య, రేపల్లెలో అమానుషం, తర్వాత విజయనగరం, అనంతపురం, దురంతాలు వీటిని తీవ్రంగా తీసుకుని మహిళా కమిషన్‌, మంత్రులు మాట్లాడిన దాఖలాలు వున్నాయా? ధైర్యం కల్పించే చర్యలు ఎంత పరిమితమైనాయి? దిశ యాప్‌ గురించిన గొప్పల తర్వాత ఇలాటి పరిస్థితి ఆందోళనకరం కాదా ?
 

                                                          జుగుప్సాకర వ్యాఖ్యానాలు

ఇదొక భాగమైతే దీనిపై వాద వివాదాలు రాయడానికి కూడా వీల్లేనంత జుగుప్స గొల్పుతున్నాయి. చంద్రబాబుకు, లోకేశ్‌కు చీరలు పంపుతామని మంత్రి రోజా అంటే, వారి సమర్థతను పరీక్షించుకోవచ్చని టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్య. ఒక మంత్రికీ మరో మాజీకి మధ్యన ఇలాంటి మాటలు ఊహించగలమా? అనుమతించదగునా? కౌలు రైతులకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కొంత ఆర్థిక సహాయం అందించి రాజకీయ విమర్శలు చేస్తే ఆయన పెళ్లిళ్ల గురించి మరోసారి మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. ఆ వెంటనే నీవు ఫలానా కులంలోనే పుట్టావా అని జనసేన కార్యదర్శి సవాలు. ఈలోగా ఖమ్మంలో మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రస్తుత టిఆర్‌ఎస్‌ మంత్రి పువ్వాడ అజరుల కుల భాషణలు, వీటికి స్పందన పేరిట వైసిపి నాయకుల ఎదురుదాడి, అసలు రాజకీయ చర్చల్లోకి తరచూ కుటుంబాలు, స్త్రీలు, మగతనాలు, కులాలు, మతాలు ఎందుకు తెస్తున్నట్టు? ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల ప్రస్తావన లేని రోజు ఒకటైనా వుందా? సమస్యలపై పోరాడే సంఘాలకు, నాయకులకు కూడా ప్రభుత్వం పాలక పక్షం కులం ముద్ర, కూటముల ముద్ర వేయడమేమిటి? వారిని సమస్యలపై ఎదుర్కొనే పేరిట ప్రధాన ప్రతిపక్ష నేతలు మాజీ మంత్రులు అదే ఫక్కీని పునరావృతం చేయడమెందుకు? ఈలోగా సోషల్‌ మీడియా లోను, మీడియా లోను బూతు పురాణాలు. ఇలాంటివి సరికాదని చెబితే మేము కాదు వారు. వారు కాదు వీరు.. అని సమర్థనలు. ఈ మధ్యలో విధానపరమైన అంశాలు వెనక్కు పోవడం. టిడిపి, వైసిపి, బిజెపి ఆర్థిక విధానాలు ఒకటే కనక, జనసేనకు అసలు ఒక స్పష్టత అంటూ లేదు గనక, వీరి తరపున ప్రచారం చేసే మీడియా సంస్థలకు అది ఎజెండా కాదు గనక తిట్లలోనే ముంచి తేలుస్తున్న తీరు గతంలో చూడనిది.
       ఉద్యోగుల పిఆర్‌సి పోరాటం, సిపిఎస్‌ రద్దు, అంగన్వాడీలు, ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, విశాఖ ఉక్కును కేంద్రం, విద్యుత్‌ కేంద్రాలు, రేవులను రాష్ట్రం ప్రైవేటీకరణ చేయడం, ఉభయులూ కూడబలుక్కుని విద్యుత్‌ మీటర్లు, మునిసిపల్‌ పన్నులు వంటివన్నీ పెంచడం, మండిపోతున్న ధరలు, ఇద్దరి మధ్య నలిగిపోతున్న పోలవరం నిర్మాణం, నిర్వాసితుల ఘోష, వెనకబడిన ప్రాంతాల నిధులకు ఎగనామం, భారీ లోటు భర్తీకి నిరాకరణ, అపారంగా పెరిగిపోతున్న అప్పుల భారంపై రకరకాల కథనాలు. చెప్పాలంటే ఇవన్నీ విధానపరమైన అంశాలు. కేంద్ర రాష్ట్రాల విధానాలు మారకుండా పరిష్కారం కావు. అయితే రాజకీయ చర్చ విధానాల వైపు గాక గత ప్రస్తుత ముఖ్యమంత్రుల ఘనత చుట్టూనే తిరుగుతుండటం విచిత్రం. ఆయన కదిలితే మెదిలితే గూస్‌బంప్స్‌ అంటూ పోస్టులు. ఈయన కేక పెట్టించారని క్రేజీ చూడమని గొప్పలు. ఈ క్రమంలో ఇద్దరు కూడా కేంద్రాన్ని చల్లగా వదిలేయడం కొసమెరుపు. రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపిని బలపరుస్తామని ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చినట్టు కూడా కథనాలు వచ్చాయి. వీరి మధ్యలో జనసేనాని ఏకంగా ఆ బిజెపి తోనే జత కట్టి మరీ పొగుడుతుంటారు.
 

                                                        పొంతన లేని పొత్తు ముచ్చట్లు

ఇక్కడ రాజకీయ ట్విస్టు ఏమిటంటే టిడిపి, జనసేన రెండూ ఐక్య పోరాటాల గురించి, ఓట్ల చీలిక నివారణ గురించి మాట్లాడటం. కొంత కాలం కిందట చంద్రబాబు నాయుడు తమది వన్‌సైడ్‌ లవ్‌లా వుందని పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఓట్ల చీలిక నివారిస్తానని ప్రకటించారు. అదే సమయంలో తాను బిజెపి రోడ్‌ మ్యాప్‌ కోసం చూస్తున్నాననీ చెప్పేశారు. తాము అధికారంలోకి రావడమే తమ మ్యాప్‌ అని బిజెపి నేతలు చెప్పేశాక తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని దాటేస్తున్నారు. తాజాగా చంద్రబాబు జగన్‌ ప్రభుత్వ తప్పుడు విధానాలపై అందరూ కలసి మరో ఉద్యమం చేయాలని అన్నారు. ఇందుకు తాము నాయకత్వం వహించేందుకు సిద్ధంగా వున్నామని గొప్పగా చెప్పారు. త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమంటూ జైళ్లకు వెళతామన్నారు. అదే త్యాగమా లేక సర్దుబాట్లలో సీట్ల త్యాగమా అని మీడియాలో చర్చ వచ్చినపుడు అసలు తెలుగుదేశం అధినేత పొత్తుకు సిద్ధమనడమే త్యాగమని ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. ముఖ్యమంత్రి పవనా లేక బాబా అని రెండు పార్టీల ప్రతినిధులు చెప్పుకుంటుంటే అదే చర్చలో వున్న సిపిఐ నాయకులు అవన్నీ ఇప్పుడు బహిరంగంగా చర్చించడం సరికాదని అడ్డుకున్నారు. బిజెపితో కలసి ఉద్యమం అన్నట్టు చంద్రబాబు చెబుతున్నది మీకు సమ్మతమేనా అని అడిగినప్పుడు కేంద్రం పాత్ర కూడా వుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన కేవలం రాష్ట్రం పైనే మాట్లాడుతున్నారు కదా అనే ప్రశ్న ఎదురైంది.
 

                                                          అసహనంలో అధికార పార్టీ

ఇక వైసిపి నాయకులైతే తమ సంక్షేమ పథకాలే సర్వస్వమంటూ అత్యాచారాల నుంచి ఆర్థిక భారాల వరకూ అన్నిటినీ దాటేయడం దుష్ప్రచారంగా కొట్టివేయడం చూస్తున్నాం. విమర్శలన్నీ తమ వ్యతిరేక మీడియా దుష్ప్రచారమని వారి ఏకైక సమాధానం. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రతి సభలో, సందర్భంలో మళ్లీ మళ్లీ అదే పల్లవి. ఈ విధంగా మీడియాపై నిరంతరం అసహన దాడి అవాంఛనీయమన్న వాస్తవాన్ని గుర్తించకపోగా ఇంకా ఇంకా తీవ్రం చేస్తున్నారు. కొత్త మంత్రులు పోటీ పడి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలన్నా, బాధితుల పరామర్శ అన్నా అరెస్టులకు పాల్పడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ఎవరు ఆందోళన, నిరసన అంటేనే పాలకులు కుట్రగా ద్రోహంగా చిత్రిస్తున్నారు. పోలవరం వంటి వాటిపై భిన్న కథనాలు చెబుతూ ఇప్పట్లో పూర్తి కాదనే సంకేతాలిస్తున్నారు. ఆర్థిక రంగంలోనూ వచ్చిన కథనాలను ఖండించడం తప్ప నిజమైన పరిస్థితి ఏమిటో ఎలా గట్టెక్కుతారో చెప్పలేకపోతున్నారు. ఆఖరుకు సంక్షేమ పథకాలకు కూడా కత్తెర పడుతున్నదనే సూచనలు పెరిగిపోతున్నాయి. రాజకీయంగానూ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అనుసరించి ప్రతిష్టంభన తొలగించే చర్యలు తీసుకోకపోగా మూడు రాజధానుల పాటే వినిపిస్తూ గందరగోళం పెంచుతున్నారు. కోర్టుల్లో ఐఎఎస్‌లకు శిక్షలు పడుతున్నా, విధానాల ఉత్తర్వుల సమీక్షకు సిద్ధ పడటం లేదు. అంతర్గతంగానూ మొన్నటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత అసమ్మతి స్వరాలు పెరగడంతో వారిని బుజ్జగించడం, పదవులు పంచడం పెద్ద తంతుగా మారింది. మూడో వంతు ఎంఎల్‌ఎలను మారుస్తారనే వార్తలు ఒకవైపు వస్తుంటే వున్నవారిలో భయం, కొత్తవారిలో సందేహం పెరిగిపోతున్నాయి. ఈ ప్రభుత్వం ఓడిపోయి తాము రావడం తథ్యమని టిడిపి ప్రచారం చేసుకుంటుంటే మనకు 175 స్థానాలు ఎందుకు రావని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో ఎవరైనా ఎంతైనా ఆశపడొచ్చు గాని అంతిమ నిర్ణేతలుగా ప్రజలే వుంటారు. అధికారంలో వున్న వారి ఆచరణను బట్టే వారు తీర్పునిస్తారు. సంక్షేమ మంత్రం ఎంతగా పఠించినా సమస్యలు పెరుగుతుంటే, భారాలు నిర్బంధాలు మోత మోగుతుంటే ప్రజలు సహించరు. అవకాశవాద రాజకీయాలను హర్షించరు. ఏతా వాతా ఎవరికి చెప్పాల్సిన పాఠం వారికి చెప్పడం అనివార్యమవుతుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి