Oct 08,2023 00:28

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు తిరుపతిలో జర్నలిస్టుల నిరసన

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
తిరుపతిలో జర్నలిస్టుల నిరసన
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జర్నలిస్టులను అరెస్టు చేసి, వారిపై ఉప చట్టం కింద తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని, అయితే అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని జర్నలిస్టు నేతలు ఉద్ఘాటించారు. తిరుపతి బస్టాండ్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద 'న్యూస్‌క్లిక్‌'పై దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌, ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌, రైతు, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు ప్రసాద్‌, జనార్ధన్‌, వళిగళం గోపి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. వాస్తవాలను రాస్తున్న జర్నలిస్టులను అణచివేయడం, చంపేందుకు వెనుకాడటం లేదని, అందులో భాగంగానే గౌరీలంకేష్‌ను గతంలో హతమార్చారని గుర్తు చేశారు. ఢిల్లీలోరైతులు చేస్తున్న పోరాటానికి సంబంధించి కేంద్రం చేస్తున్న కుట్రను ఎప్పటికప్పుడు ప్రగతిశీల పత్రికలకు అందించిన న్యూస్‌క్లిక్‌ను 2021 నుంచి వేధిస్తూనే ఉందన్నారు. జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్ర వేయడం సరికాదన్నారు. నిరసనకు సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నాయకులు పెంచలయ్య, విశ్వనాథ్‌, ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షులు పి.అంజయ్య సంఘీభావం తెలిపారు.జర్నలిస్టు సంఘాల నాయకులు గిరిధర్‌, ఆదిమూలం శేఖర్‌, కె.గిరిబాబు, మునిరాజా, నరేంద్రరెడ్డి, నరేంద్ర, రాధాక్రిష్ణ, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.