Sep 25,2023 20:38

తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనలో పాల్గొన్న మాజీ ఎంపి పి.మధు


అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
అంగన్‌వాడీల నిరసనలో పి.మధు
వామపక్ష కార్మిక సంఘాలు మద్దతు
నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలకు పిలుపు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌, యంత్రాంగం
తెలంగాణ కంటే ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు ఎక్కువ జీతం ఇస్తామని జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే వారిని అరెస్ట్‌ చేయడం దారుణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పెనుమల్లి మధు విమర్శించారు. సోమవారం సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలపై పని భారం పెరగడమే కాకుండా వారి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, వేతనాలు పెంచాలని చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం అన్యాయమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టులు చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లు నింపివేశారని అన్నారు. అంగన్వాడీలు చేసే పోరాటానికి వామపక్ష పార్టీలతో పాటు కార్మిక వర్గం మద్దతు ఇస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అంగన్వాడీలకు న్యాయం చేస్తామని అసెంబ్లీలో జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసే వారిని ఎక్కడపడితే అక్కడ నిర్బంధించి జైలుకు తరలించడం శోచ నీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచడమే కాకుండా వారి పని భారం కొంతవరకు తగ్గించారని జగన్‌ మోహన్‌ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ఎంతమందిని అరెస్టులు చేసిన ఉద్యమం ఆపేది లేదని ,వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకష్ణ లు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని, కేసులకు కార్మిక వర్గం భయపడదని, విద్యుత్‌ పోరాటంలో అశువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో రాష్ట్రంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతుందని అన్నారు. నిర్బంధాలు కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా తమ శ్రేణులు నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఐఎఫ్‌టియు నాయకులు వెంకటరత్నం, నాయకులు ఎన్‌ డి రవి , కే వేణుగోపాల్‌, పి బుజ్జి, రఘు, తంజావూరు మురళి, డివైఎఫ్‌ఐ నాయకులు జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, అంగన్వాడి నాయకురాలు నాగరాజమ్మ. ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి .వైయస్‌ మణి. శ్రీరాములు. శ్రీనివాసులు. మోహన్‌ రెడ్డి. రజాక్‌ .సురేష్‌. మహేంద్ర. నరసింహులు. ముద్దుకష్ణ. కనకరాజు పాల్గొన్నారు
పుత్తూరులో... అంగన్‌వాడీల నిర్బంధాన్ని నిరసిస్తూ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో స్వయంగా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయమని అడిగితే అరెస్టు చేయడం దారుణమన్నారు. కనీస వేతనం 26వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు విజయ కుమారి, ప్రమీల ,ధనమ్మ, హైమావతి, అంబికా, అన్నపూర్ణ, యశోద తదితరులు పాల్గొన్నారు.
నిర్బంధం దుర్మార్గం : శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి
అంగన్‌వాడీ వర్కర్లపై పోలీసుల నిర్బంధం దుర్మార్గమని శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి అన్నారు. న్యాయమైన సమస్యలపై అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటంపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని ఖండించారు. తిరుపతి యశోదానగర్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నిర్బంధాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్రంలో యావత్‌ కార్మికవర్గం ఐక్యమై నిరవధిక పోరాటాలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నపూర్ణ, వాడ గంగరాజు పాల్గొన్నారు.
తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనలో పాల్గొన్న మాజీ ఎంపి పి.మధు