Mar 01,2023 21:47

మీడియాతో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
- అరెస్టులు చేసిన చోటే ధర్నాలు చేయండి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నేడు విజయవాడ కేంద్రంలో ధర్నా నిర్వహిస్తుండగా ముందస్తు అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని ఆరోపించారు. బుధవారం నంద్యాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తికొండ, కర్నూలు, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఎక్కడ పోలీసులు అరెస్టు చేసినా అక్కడే పార్టీ నాయకులు, శ్రేణులు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అరెస్టులకు ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వంలో కదలిక వచ్చే వరకు ఈ నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,50,000 సరిపోవని, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, సిమెంటు, ఇసుక, ఇటుకలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ నేపథ్యంలో చేస్తున్న ధర్నాను ప్రభుత్వం గుర్తించి చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలే గాని అరెస్టులతో బెదిరిస్తే ఎవరూ భయపడరని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ పాల్గొన్నారు.