Jan 23,2022 18:38

న్యూఢిల్లీ :  తన కేబినెట్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి)ని కేంద్రం ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వెల్లడించారు. పంజాబ్‌ ఎన్నికలకు ముందు మరికొన్ని రోజుల్లో ఢిల్లీ ఆరోగ్య, హోం శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ని అరెస్ట్‌ చేయవచ్చని అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్‌ తరపున జైన్‌ పంజాబ్‌లో ప్రచారం చేపడుతున్నారు. అరెస్టయ్యేందుకు కూడా తాము సిద్ధమేనని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సవాలు విసిరారు. గతంలోనూ కేంద్రం తనతో పాటు పలువురు ఆప్‌నేతలపై దాడులు నిర్వహించిందనీ, కానీ ఏమీ లభించలేదని చెప్పారు. ''కేంద్ర దర్యాప్తు సంస్థలు కోరుకుంటే నాతో పాటు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఇలాంటి అరెస్టులకు మేము భయపడేది లేదు. మోడీ ప్రభుత్వం పంజాబ్‌ ఎన్నికలకు ముందు మంత్రిని అరెస్టు చేయాలనుకుంటోంది. వారు ఇడిని, సిబిఐ,  ఇతర సంస్థలను పంపుతున్నారు. నాతో సహా ఎవరిని అరెస్టు చేయాలనుకున్నా వారు చేసుకోవచ్చు. మేము చేసిన తప్పేమీ లేదు. భయపడేది కూడా లేదు. చిరునవ్వుతోనే వారిని స్వాగతిస్తాం'' అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అరెస్ట్‌లకు భయపడి తాము వెనక్కి తగ్గబోమని.. పంజాబ్  ఎన్నికల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  ప్రత్యర్థులపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్ని లాగా తాము కన్నీరు కార్చమని, ఎందుకంటే చన్నిలా తాము తప్పు చేయలేదని ఎద్దేవా చేశారు.