Nov 10,2023 20:44

విజయవాడ ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి - భీమవరం
సిపిఎం సీనియర్‌ నేత, మాజీ ఎంఎల్‌ఎ రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్‌ఎస్‌) జీవితం నేటి యువతరానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి స్ఫూర్తిదాయకమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ కొనియాడారు. సిపిఎం చేపట్టిన రాష్ట్ర బస్సు యాత్ర భీమవరం చేరుకున్న సందర్భంగా యాత్ర బృందం, రాష్ట్ర, జాతీయ నాయకులు ఆర్‌ఎస్‌ను మర్యాదకపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ను కలవడం సంతోషకరమన్నారు. మహానేత పుచ్చలపల్లి సుందరయ్యతో ఉద్యమాలు చేసిన నేతల్లో ఆర్‌ఎస్‌ ఒకరన్నారు. ఆర్‌ఎస్‌ జీవితం, ఉద్యమ పటిష్టత నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా నిర్మాతగా, మాజీ ఎంఎల్‌ఎగా ఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. నేటితరం కమ్యూనిస్టులకు, నేటి ఉద్యమాలకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఆర్‌ఎస్‌ స్ఫూర్తితో నేడు దేశంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిన బూనారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక ప్రజల మధ్య అనేక మత, కుల ఘర్షణలతో చీలుస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికీ భూ పంపిణీ జరిగే వరకూ పోరాడతామన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన జరిగే సిపిఎం ప్రజారక్షణ భేరి భారీ బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం, రాష్ట్ర నేతలు కెవి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, కె.శ్రీనివాస్‌, ఎం.హరిబాబు, జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ పాల్గొన్నారు.