ప్రజాశక్తి - మధురవాడ : రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపి వైద్యులకు శిక్షణతో పాటు గుర్తింపత్రం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ సిద్ధార్థ డిమాండ్ చేశారు. మంగళవారం రుషికొండ సాయి ప్రియ రిసార్ట్స్‌లో సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (ఆర్‌ఎంపి) మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగాక ఉండగా ఆర్‌ఎంపి వైద్యులకు ఒక జీవో తీసుకొచ్చి కొంత మేర శిక్షణ ఇచ్చారని, అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవో ద్వారా శిక్షణ ఇచ్చి, గుర్తింపు పత్రం అందించాలని కోరారు. ప్రతి జిల్లాలో 2000 మంది వరకు ఆర్‌ఎంపి వైద్యులు ఉన్నారని, వారందరికీ శిక్షణ ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో ముందుగా రోగికి వైద్యం అందించేది ఆర్‌ఎంపి వైద్యులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు జిఎస్.ప్రసాద్, కంబాల బాబూరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, నండూరి ఉమా శంకర్, పలువురు ఆర్‌ఎంపి వైద్యులు పాల్గొన్నారు.










