పోలీసులు తమకు అందిన సమాచారంతో మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనికీలు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న యువకుని వద్ద నిషేదిత డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి విచారిస్తున్నారు.
ప్రజాశక్తి - మార్టూరు రూరల్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టూరు సీఐ షేక్ థెరిస్సా ఫిరోజ్, ఎస్ఐ కోడూరి కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు తనికీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలు గురువారం స్థానికంగా కలకలం రేపాయి. నిషేదిత డ్రగ్స్‌ను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న మార్టూరు సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద తనికీలు చేశారు. బెంగళూరు నుండి గుంటూరు వైపు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుని ఆపి తనిఖీ చేశారు. అందులో అనుమానాస్పదంగా బ్యాగ్ తో ప్రయాణిస్తున్నఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెనుకనే కారులో వస్తున్న మరి కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు సమాచారం. పట్టుబడిన వీరంతా గుంటూరులోని ఓ ఇంజీనిరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న విద్యార్థులు గా గుర్తించినట్లు సమాచారం. పట్టుబడ్డ నిందితులను విడిపించడం కోసం గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్లే లాబీయింగ్ చేసినట్లు తెలిసింది. మార్టూరు సీఐ షేక్ థెరిస్సా ఫిరోజ్, ఎస్ఐ కోడూరి కమలాకర్ డ్రగ్స్ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసును పకడ్బందీగా విచారిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల వద్ద ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనపరచుకుని విచారిస్తున్నారు. దీనిపై పుర్తి వివరాలు పోలిసుల విచారణలో తేలాల్సి ఉంది.










