లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బిజెపి గాలం వేసే పనులు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అఖిలేష్ నేతృత్వంలోని కూటమిలో ఒకటైన రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌధరిని తన వైపు తిప్పుకునేందుకు ఊరించే ప్రయత్నాలను కేంద్రం మంత్రి అమిత్‌షా ఆపడం లేదు. బులంధర్ షహర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తనతో కూటమి కట్టాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్.. జయంత్‌ను కోరారని, కానీ ఆయన గొంతు ఎక్కడా వినిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ' యుపిలో ఎస్‌పి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే... జయంత్ గొంతును నొక్కేస్తారన్న విషయం ఆయనకు తెలియదు. తండ్రి, కుటుంబ సభ్యుల మాటే వినని వ్యక్తి.. మీ మాట వినరు. అజమ్ ఖాన్ జైలు నుండి తిరిగి వచ్చి.. అఖిలేష్ యాదవ్ పక్కన ఉంటారు.' అంటూ వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్.. ఎస్‌పి వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మధ్య ఉన్న వైరాన్ని ఈ సందర్భంగా అమిత్‌షా ప్రస్తావించారు. కాగా, ఆర్‌ఎల్‌డి చీఫ్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమిత్ షా చేసిన రెండవ ప్రయత్నం ఇది. జవవరి 26న హోం మంత్రి, జాట్‌నేతలు భేటీ అయిన సమయంలో కూడా.. జయంత్ చౌధరి.. సరైన కూటమిని ఎంచుకోలేదని, బిజెపిలోకి రావాలంటే ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.










