Jun 01,2023 22:42

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సహకార సంఘాలకు ఆరేళ్లుగా ఎన్నికలు జరగడంలేదు. 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించింది. అప్పట్లో మెజార్టీ సంఘాలను టిడిపి కైవసం చేసుకోవడంతో డిసిసిబిని ఆపార్టీ దక్కించుకుంది. 2017లో డిసిసిబి పదవీకాలం ముగిసినా అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా అప్పటి పాలకవర్గాలనే 2019 వరకు కొనసాగించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కాలందీరిన పాలక వర్గాలను తొలగించి 2019-20లో సొసైటీలకు పర్సన్‌ ఇన్‌ఛార్జిలను నియమించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు కలెక్టరు, సొసైటీలకు మండల స్థాయి అధికారులను పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా నియమించింది.
2020లో సహకార సంఘాల చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్‌ సభ్యులతో కమిటీలను నియమించారు. డిసిసిబి చైర్మన్‌గా రాతంశెట్టి సీతారామాంజనేయులు రెండున్నరేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు డైరక్టర్లుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 150 సహకార సంఘాలకు ఒకరు చైర్మన్‌, ఇద్దరుసభ్యులతో పాలక వర్గాలుగా కమిటీలను నియమించారు. వీరంతా వైసిపికి చెందినవారే. మొత్తం 169 సంఘాలు ఉండగా ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగిన సంఘాలలో విచారణ కొనసాగుతున్నందున 19 సంఘాల్లో పర్సన్‌ ఇన్‌ఛార్జిల పాలన కొనసాగుతోంది. మొత్తం 863 ఆర్‌బికేలకు అనుసంధానంగా సొసైటీల సంఖ్య పెంచాలని కూడా ఒకదశలో ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు.
సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని రెండేళ్ల క్రితమే కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత నిర్వహిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పినా మళ్లీ కదలిక లేదు. రానున్న 10 నెల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితులు కన్పిస్తుండటంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిగేపరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నా గిడ్డంకులు లేకపోవడం వల్ల ఈ సేవలు పాక్షికంగానే ఉన్నాయి. అందువల్ల సహకార సంఘాలను ఆర్‌బికేలకు అనుసంధానం చేసేలా రెండేళ్ల క్రితమే ఆలోచించిన ప్రభుత్వం ఆ తరువాత ఈ అంశంలో వెనక్కితగ్గింది. ఇందుకోసం సహకార సంఘాలను పెంచుతున్నట్టు గతేడాది ప్రచారం జరిగినా మళ్లీ కదలిక లేదు. సహకార సంఘాలను పెంచితే నాబార్డు ద్వారా సహకార సంఘాలకు గిడ్డంగుల నిర్మాణానికి నిధులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇంతవరకు స్పందన లేదు.