ప్రజాశక్తి -అనకాపల్లి
ఆచార్య ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ (ఆప్కాస్)లో కలపాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం నుంచి కార్మికులు సమ్మెబాట పట్టారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక ఆర్‌ఎఆర్‌ఎస్ వద్ద కాంట్రాక్టు కార్మికులు యూనియన్ ఆధ్వర్యాన టెంటు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకర్రావు, నాయకులు గంట శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్ సమస్య పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై పలుమార్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినా పరిష్కారం కాలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, చాలీచాలని జీతాలతో కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గెజిట్ లేదా కార్మిక శాఖ ఇచ్చిన కనీస వేతనాల జీవో అమలు చేయాలన్నారు. ఇతర యూనివర్సిటీలో చెల్లిస్తున్న వేతనాల మాదిరిగా ఇక్కడ చెల్లించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందీశ్వరరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ అనేకమార్లు వినతి పత్రాలు అందజేశామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు నడుపూరు చంద్రశేఖర్, గెడ్డం లక్ష్మణరావు, చందక మహాలక్ష్మి, ఎ.మంగ, కొణతాల సంతోష్, హేమ, సాయి తదితరులు పాల్గొన్నారు.
ర










